Rains Effect | చేతికొచ్చిన పంట నీళ్ల పాలు – బయ్యారంలో భారీగా నష్టపోయిన రైతులు

క‌ళ్లాల్లో ఆర‌బోసిన పంట అంతా వ‌ర్షంపాలు
నీళ్ల‌లో కొట్టుకుపోయిన మ‌క్క‌జొన్న, మిర్చి
ఆదుకోవాల‌ని ప్ర‌భుత్వాన్ని కోరుతున్న రైతులు
మ‌రో రెండ్రోజులూ వ‌ర్షాలుంటాయన్న వాతావ‌ర‌ణ‌శాఖ‌
జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని రైతుల‌కు సూచ‌న‌లు

బయ్యారం, ఆంధ్ర‌ప్ర‌భ :
అకాల వర్షం కారణంగా చేతికొచ్చిన పంటలు నీళ్ల పాలయ్యాయి. మహబూబాబాద్‌ జిల్లా బయ్యారం మండలంలో గురువారం అర్ధరాత్రి కురిసిన వర్షానికి మ‌క్కజొన్న, మిర్చి పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఏజెన్సీ గ్రామాల్లో పెద్ద ఎత్తున యాసంగిలో మ‌క్కజొన్న సాగు చేయగా వంట చేతికి రావడంతో విక్రయించేందుకు కళ్లాల్లో ఆరబెట్టారు. ఈ క్రమంలో ఒక్కసారిగా ఆకాల వర్షం కారణంగా మ‌క్కజొన్న పంట తడిసి ముద్దయింది. మిర్చి పంట చివరి దశకు చేరుకోగా విక్రయించేందుకు కల్లాల వద్ద అరబెట్టగా వర్షం కారణంగా తడిసిపోయింది.

వర్ష సూచన ఉండడంతో పంటలను టార్పాలిన్‌ కప్పి కాపాడేందుకు రైతులు యత్నించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. అప్పు తెచ్చి పెట్టుబడి పెట్టిన పంటకు నష్టం వాటిల్లడంతో రైతులు ఆవేదన చెందుతున్నారు. నష్టపరిహారం అందించి ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు. అదేవిధంగా మండలంలోని వెంకట్రాంపురం గ్రామంలో గురువారం రాత్రి ఓ ఇంట్లోని కొబ్బరి చెట్టుపైపిడుగు పడటంతో స్థానికులు భయాందోళన చెందారు.

మరో రెండు రోజులు వానలు

తెలంగాణలో రాగల రెండు రోజుల్లో వడగండ్ల వానలు కురిసే అవకాశం ఉంద‌ని హైదరాబాద్‌ వాతావరణ కేందం హెచ్చరించింది. ఈ మేరకు వివిధ జిల్లాలకు ఆరెంజ్‌ , ఎల్లో హెచ్చరికలను జారీచేసింది. శుక్ర‌వారం ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌, నిర్మల్‌, నల్లగొండ, సూర్యాపేట, హన్మకొండ, భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్‌ , మలాజ్‌గిరి, వికారాబాద్‌, జనగాం తదితర జిల్లాల్లో అకడకడా ఉరుములు, ఈదురుగాలులతో కూడిన వానలు పడుతాయని తెలిపింది.

అధికారులను అప్రమత్తం చేసిన మంత్రి తుమ్మల
దెబ్బతిన్న పంటలపై ప్రాథమిక నివేదిక అందించాలన్న మంత్రి
మార్కెట్లోకి వచ్చిన పంట ఉత్పత్తులను కాపాడాలని ఆదేశాలు

అకాల వర్షాలు, వడగళ్లతో పంటలు దెబ్బతినే ప్రమాదం నెలకొన్న నేపథ్యంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. పంటలకు జరిగిన నష్టాన్ని త్వరితగతిన అంచనా వేసి, ప్రాథమిక నివేదికను వెంటనే అందించాలని సంబంధిత శాఖ అధికారులకు సూచించారు. మార్కెట్లకు చేరుకున్న పంట ఉత్పత్తులను జాగ్రత్తగా కాపాడాలని మంత్రి తెలిపారు. వర్షం కారణంగా పంట నష్టపోవకుండా తగిన రక్షణ చర్యలు తీసుకోవాలని మార్కెటింగ్ శాఖ అధికారులకు సూచనలు జారీ చేశారు. అలాగే, ఇప్పటికే కొనుగోలు చేసిన ఉత్పత్తులను వర్షానికి లోనుకాకుండా వెంటనే గోడౌన్లకు తరలించాలని మార్క్‌ఫెడ్ అధికారులను ఆదేశించారు. రైతులకు నష్టం కలగకుండా, ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా నిలుస్తుందని మంత్రి తుమ్మల హామీ ఇచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *