జిల్లాలో పోలీసింగ్‌కు కొత్త దిశ..
- రాత్రి పహారా నుంచి డ్రగ్స్ నియంత్రణ వరకు ప్రత్యేక కార్యాచరణ
- మహిళా భద్రత, సైబర్ నేరాల కట్టడికి సాంకేతికతకు పెద్దపీట
శ్రీ సత్యసాయి బ్యూరో, ఆంధ్రప్రభ : శ్రీ సత్యసాయి జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణతో పాటు నేరాల నియంత్రణ, డ్రగ్స్ నిర్మూలన, మహిళా భద్రత, సైబర్ నేరాల కట్టడి, స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ప్రత్యేక నిఘాపై జిల్లా యంత్రాంగం దృష్టి సారించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్షల అనంతరం జిల్లా కలెక్టర్ ఎ. శ్యామ్ ప్రసాద్, ఎస్పీ ఎస్. సతీష్ కుమార్ సమన్వయంతో పలు కీలక చర్యలకు శ్రీకారం చుట్టారు. సంప్రదాయ పోలీసింగ్‌తో పాటు సాంకేతిక పరిజ్ఞానాన్ని విస్తృతంగా వినియోగిస్తూ జిల్లాలో నేర నియంత్రణకు కొత్త విధానాన్ని అమలు చేస్తున్నారు.
రాత్రివేళల్లో మరింత నిఘా…

జిల్లాలో రాత్రివేళల్లో నేరాల నియంత్రణకు ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తున్నారు. గ్రామాలు, జాతీయ రహదారులు, పట్టణ ప్రాంతాలు, కీలక కూడళ్లలో ప్రత్యేక రాత్రి పహారా నిర్వహిస్తున్నారు. అనుమానాస్పద వాహనాలు, వ్యక్తులను తనిఖీ చేయడంతో పాటు అవసరమైన చోట వేలిముద్రలను సేకరిస్తున్నారు. బ్యాంకులు, ఏటీఎంలు, ప్రముఖ ఆలయాలు, పుణ్యక్షేత్రాల వద్ద భద్రతను పెంచుతున్నారు. జాతీయ రహదారులపై అర్ధరాత్రి తర్వాత మద్యం సేవించి వాహనాలు నడిపే వారిని గుర్తించేందుకు బ్రీత్ అనలైజర్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ప్రమాదాల నివారణకు ‘స్టాప్, ఫేస్ వాష్ అండ్ గో’ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు. అంతర్రాష్ట్ర సరిహద్దుల్లోనూ అక్రమ రవాణా, అసాంఘిక శక్తుల కదలికలపై ప్రత్యేక నిఘా కొనసాగుతోంది.
డ్రోన్లతో రాత్రి నిఘా…
పోలీసింగ్‌లో సాంకేతిక పరిజ్ఞాన వినియోగానికి జిల్లా పోలీసు యంత్రాంగం ప్రాధాన్యం ఇస్తోంది. ధర్మవరం, బుక్కరాయసముద్రం మండలాల్లో నైట్ విజన్ డ్రోన్ల సహాయంతో రాత్రివేళల్లో నిఘా కొనసాగిస్తున్నారు. సాధారణ పోలీసు గస్తీకి అందని ప్రాంతాలను కూడా డ్రోన్ల ద్వారా పరిశీలించే అవకాశం ఉండటంతో నేర నియంత్రణలో ఇది కీలకంగా మారుతోంది. రౌడీషీటర్లు, హిస్టరీషీటర్ల కదలికలపైనా నిరంతర పర్యవేక్షణ కొనసాగుతోంది. గత నెలలో 55 మంది హిస్టరీషీటర్లను రూ.5 లక్షల బాండ్‌తో బైండోవర్ చేసినట్లు పోలీసు అధికారులు వెల్లడించారు. నేరాలకు పాల్పడే అవకాశం ఉన్న వ్యక్తులపై ముందస్తు చర్యలతో పాటు వారి కదలికలను నిశితంగా పరిశీలిస్తున్నారు.
‘డ్రగ్స్ ఫ్రీ’ జిల్లాపై ప్రత్యేక దృష్టి…

యువత, విద్యార్థులను మత్తుపదార్థాల బారిన పడకుండా కాపాడటమే లక్ష్యంగా జిల్లాను డ్రగ్స్ ఫ్రీ జిల్లాగా తీర్చిదిద్దేందుకు కలెక్టర్, ఎస్పీ స్థాయిలో ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. ఎన్కార్డ్ (ఎం సి ఓ ఆర్ డి) సమావేశంలో గంజాయి రవాణా, విక్రయాలను అరికట్టేందుకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించాలని ఆదేశించారు. గ్రామాల్లోని బెల్ట్ షాపులను పూర్తిగా నిర్మూలించడంతో పాటు మత్తుపదార్థాల దుష్ప్రభావాలపై యువత, విద్యార్థుల్లో విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు.
ఫీల్డ్ స్థాయిలో అడ్వాన్స్డ్ డ్రగ్ టెస్టింగ్ కిట్ల వినియోగం ప్రారంభించడం ద్వారా గతంలో వినియోగించిన కొన్ని రకాల మత్తుపదార్థాలను కూడా గుర్తించే సామర్థ్యం పెరిగింది. విద్యాసంస్థల్లో ఈగల్ క్లబ్‌లను ఏర్పాటు చేసి యాంటీ డ్రగ్ సందేశాన్ని విద్యార్థుల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. కేవలం నేరస్థులను పట్టుకోవడమే కాకుండా మత్తుపదార్థాల వైపు యువత వెళ్లకుండా ముందస్తు అవగాహన కల్పించడమే ప్రధాన లక్ష్యంగా చర్యలు సాగుతున్నాయి.
మహిళల భద్రతకు ప్రాధాన్యం…
మహిళలు, బాలికల భద్రత విషయంలో ప్రత్యేక దృష్టి పెట్టాలని పోలీసు అధికారులకు ఆదేశాలు జారీ అయ్యాయి. మహిళా హెల్ప్డెస్క్లకు వచ్చే ఫిర్యాదులను ఆలస్యం చేయకుండా పరిష్కరించాలని సూచించారు. మహిళలు, విద్యార్థినుల్లో ‘శక్తి’ యాప్‌పై అవగాహన కల్పిస్తున్నారు.
ఆశా కార్యకర్తలు, విద్యార్థినులకు యాప్ వినియోగంపై ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. అదే సమయంలో గ్రామీణ ప్రాంతాల్లో సైబర్ నేరాలు, బాల్య వివాహాలపై అవగాహన కార్యక్రమాలను విస్తృతం చేస్తున్నారు. ఆన్లైన్ మోసాలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండేలా పోలీసు శాఖ ప్రచారం చేపడుతోంది.
ఎన్నికల నేపథ్యంలో మరింత అప్రమత్తత…

స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నాహాలు జరుగుతున్న నేపథ్యంలో జిల్లాలో పోలీసు నిఘా మరింత పెరిగే అవకాశం ఉంది. ఫ్యాక్షన్ ప్రభావిత గ్రామాలు, అక్రమ మద్యం, ఇసుక అక్రమ రవాణా, జూదం వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఎన్నికల సమయంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే పరిస్థితులు తలెత్తకుండా ముందస్తు చర్యలకు ప్రాధాన్యం ఇస్తున్నారు.
కోర్టు కేసుల విషయంలోనూ పోలీసు శాఖ ఫాలోఅప్‌ను బలోపేతం చేస్తోంది. 2025లో 345 కేసుల్లో శిక్షలు పడేలా పోలీసు, న్యాయ విభాగాల సమన్వయంతో చర్యలు చేపట్టినట్లు అధికారులు పేర్కొన్నారు. ఇకపై కూడా కేసుల దర్యాప్తు నుంచి కోర్టు వరకు ప్రతి దశలో పర్యవేక్షణ పెంచాలని నిర్ణయించారు.
‘గోల్డెన్ అవర్’పై ప్రత్యేక దృష్టి…
అత్యవసర ఘటనల్లో తొలి గంట అత్యంత కీలకమనే ఉద్దేశంతో ‘గోల్డెన్ అవర్’ విధానాన్ని సమర్థంగా అమలు చేయాలని జిల్లా యంత్రాంగం దృష్టి సారించింది. ఫిర్యాదు అందిన వెంటనే స్పందించడం, ఘటనాస్థలానికి వేగంగా చేరుకోవడం, బాధితులకు తక్షణ సహాయం అందించడం వంటి అంశాలపై ప్రత్యేక పర్యవేక్షణ కొనసాగుతోంది. అదేవిధంగా పోలీసు శాఖ పనితీరును నెలవారీగా అంచనా వేసే విధానానికి ప్రాధాన్యం ఇస్తున్నారు. దీంతో ప్రతి విభాగం పనితీరు, పెండింగ్ కేసులు, నేర నియంత్రణ చర్యలు, ప్రజల ఫిర్యాదుల పరిష్కారం తదితర అంశాలపై నిరంతర సమీక్షకు అవకాశం ఏర్పడుతోంది.
సాంకేతికతే కీలక ఆయుధం…
శ్రీ సత్యసాయి జిల్లాలో ప్రస్తుత పోలీసింగ్ విధానాన్ని పరిశీలిస్తే సంప్రదాయ గస్తీతో పాటు డ్రోన్లు, డ్రగ్ టెస్టింగ్ కిట్లు, బ్రీత్ అనలైజర్లు, డిజిటల్ అప్రమత్తత వంటి సాంకేతిక సాధనాల వినియోగం పెరుగుతోంది. రాత్రి పహారా, డ్రగ్స్ నియంత్రణ, మహిళా భద్రత, సైబర్ నేరాల కట్టడి, ఎన్నికల నిఘా—ఈ ఐదు అంశాలను సమన్వయంతో ముందుకు తీసుకెళ్లడం ద్వారా జిల్లాలో మరింత ప్రజానుకూలమైన, సాంకేతిక ఆధారిత పోలీసింగ్‌కు బాటలు వేస్తున్నారు. మొత్తంగా ‘డ్రగ్స్ ఫ్రీ జిల్లా–సురక్షిత జిల్లా’ లక్ష్యంతో జిల్లా యంత్రాంగం ముందుకు సాగుతుండగా.. రాత్రి నిఘా, సాంకేతిక పర్యవేక్షణ, మహిళా భద్రత, సైబర్ అవగాహన, ఎన్నికల ముందస్తు చర్యలు రాబోయే రోజుల్లో పోలీసింగ్‌కు ప్రధాన ప్రాధాన్యతలుగా మారనున్నాయి.
