private hospital | దెబ్బతిన్న రెండు కిడ్నీలు

private hospital | దెబ్బతిన్న రెండు కిడ్నీలు
మంచానికే పరిమితమైన మోక్షిత
వైద్యానికి రూ.10 లక్షలు అవసరం
దాతల సహాయం కోసం ఎదురుచూపులు
private hospital | సూర్యాపేట రూరల్, ఆంధ్రప్రభ : ఆడుకోవాల్సిన వయసులో ఆసుపత్రి మంచానికే పరిమితమైంది.. ఓ ఐదేళ్ల చిన్నారి మోక్షిత. ఇంకా ప్రపంచం అంటే ఏమిటో కూడా పూర్తిగా తెలియని ఆ పసిపాప ప్రస్తుతం ప్రాణాలతో పోరాడుతోంది. రెండు కిడ్నీలు తీవ్రంగా దెబ్బతినడంతో చికిత్స కోసం కుటుంబం ఆర్థికంగా కుంగిపోయి దాతల సహాయం కోసం వేడుకుంటోంది.
సూర్యాపేట రూరల్ మండలం యండ్లపల్లి గ్రామానికి చెందిన ఇంద్రకంటి చిరంజీవి – నాగేశ్వరి దంపతులకు ముగ్గురు సంతానం. వారిలో పెద్ద కుమార్తె మోక్షితకు ఇటీవల జ్వరం రావడంతో సూర్యాపేట ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ నిర్వహించిన వైద్య పరీక్షల్లో ఒక కిడ్నీ పూర్తిగా పనిచేయడం లేదని, మరో కిడ్నీ కూడా 70 శాతం వరకు దెబ్బతిన్నట్లు వైద్యులు నిర్ధారించారు. చిన్నారి పరిస్థితి విషమంగా ఉండటంతో హైదరాబాదులోని నిలోఫర్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ కూడా ఆరోగ్యం క్షీణిస్తుండటంతో మెరుగైన చికిత్స కోసం ప్రైవేట్ ఆసుపత్రిలో చూపించాలని వైద్యులు సూచించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. అయితే రోజువారీ కూలి, ఆటో డ్రైవింగ్ ద్వారానే జీవనం సాగించే ఈ కుటుంబానికి లక్షల రూపాయల వైద్య ఖర్చులు భరించడం అసాధ్యంగా మారింది.
తండ్రి చిరంజీవి ఆటో డ్రైవర్‌గా పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. కానీ చిన్నారిని ఆసుపత్రుల్లో చూపించాల్సి రావడంతో పని చేయలేని పరిస్థితి ఏర్పడింది. ఫైనాన్స్‌లో తీసుకున్న ఆటోకు కిస్తీలు కూడా చెల్లించలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సొంత ఇల్లు కూడా లేని ఈ కుటుంబం ప్రస్తుతం తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉంది. “మా పాపను కాపాడండి… మా చేతుల్లో ఏమీ లేదు” అంటూ మోక్షిత తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమవుతున్నారు. చిన్నారి చికిత్సకు సుమారు రూ.10 లక్షల వరకు ఖర్చవుతుందని వైద్యులు తెలిపినట్లు కుటుంబ సభ్యులు చెప్పారు. దాతలు, సేవా సంస్థలు స్పందించి తమ చిన్నారికి ప్రాణదానం చేయాలని వారు వేడుకుంటున్నారు.
సహాయం చేయదలచిన వారు:
ఇంద్రకంటి చిరంజీవి
PhonePe / Google Pay: 9505390092
