కర్నూలు జిల్లాలో వర్షాభావం.. రైతుల్లో ఆందోళన

కర్నూలు బ్యూరో, ఆంధ్రప్రభ : కర్నూలు జిల్లా వ్యాప్తంగా మే నెలలో ఆశించిన స్థాయిలో వర్షపాతం నమోదుకాక రైతాంగంలో ఆందోళన నెలకొంది. జిల్లా మొత్తానికి సాధారణంగా 40.1 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదుకావాల్సి ఉండగా, ఇప్పటివరకు కేవలం 19.2 మిల్లీమీటర్ల వర్షపాతం మాత్రమే నమోదై 52 శాతం లోటు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.
శుక్రవారం జిల్లాలో పలుచోట్ల స్వల్ప వర్షాలు కురిశాయి. నమోదైన వర్షపాతం వివరాల ప్రకారం, జిల్లాలోని 26 మండలాల్లో 22 మండలాల్లో మాత్రమే వర్షపాతం నమోదైంది. అత్యధికంగా నందవరం మండలంలో 68 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదవగా, హోళగుందలో 40.2 మి.మీ, ఎమ్మిగనూరులో 23.2 మి.మీ, కోడుమూరులో 22.6 మి.మీ వర్షపాతం నమోదైంది. మరోవైపు ఆలూరు మండలంలో కేవలం 0.4 మి.మీ మాత్రమే నమోదైంది. ఆస్పరి, పత్తికొండ మండలాల్లో వర్షపాతం నమోదు కాలేదు.
2025-26 సంవత్సరానికి సంబంధించి నైరుతి రుతుపవనాల కాలంలో జిల్లాలో సాధారణానికి మించి 46 శాతం అధిక వర్షపాతం నమోదైనప్పటికీ, ఈశాన్య రుతుపవనాలు, శీతాకాలం, వేసవి కాలాల్లో మాత్రం భారీ లోటు కనిపించింది. ముఖ్యంగా జనవరి నుంచి మే వరకు నమోదైన వర్షపాతం సాధారణ స్థాయికి చాలా తక్కువగా ఉండటంతో భూగర్భ జలాలపై ప్రభావం పడే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.
వర్షాల లోటుతో ఇప్పటికే రైతులు సాగు పనులపై సందిగ్ధంలో పడగా, ముందస్తు వర్షాల కోసం ఎదురుచూస్తున్నారు. రైతాంగానికి ఇబ్బందులు తలెత్తకుండా వ్యవసాయ శాఖ అప్రమత్తంగా ఉండాలని ప్రజలు కోరుతున్నారు.
