Elephant Attack | రైతులకు భారీ నష్టం
Elephant Attack | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: అన్నమయ్య జిల్లాలో ఏనుగుల సంచారం రైతులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. కేవీ.పల్లి మండలంలోని పలు గ్రామాల వ్యవసాయ పొలాల్లోకి రాత్రి ఎనిమిది ఏనుగుల గుంపు చొరబడి బీభత్సం సృష్టించింది.
ఏనుగులు వరి పంటతో పాటు టెంకాయ తోటలను ధ్వంసం చేశాయి. అలాగే వ్యవసాయ బోరు పైపులను కూడా పగులగొట్టడంతో రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఈ ఘటనలో సుమారు రూ.5 లక్షల మేర నష్టం జరిగినట్లు బాధిత రైతులు తెలిపారు.
ఏనుగుల సంచారంతో గ్రామస్థులు రాత్రంతా భయాందోళనలకు గురయ్యారు. అటవీశాఖ అధికారులు వెంటనే స్పందించి ఏనుగులను అటవీ ప్రాంతంలోకి తరలించేందుకు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. పంటలు నష్టపోయిన రైతులకు ప్రభుత్వం తక్షణమే నష్టపరిహారం అందించి ఆదుకోవాలని బాధితులు విజ్ఞప్తి చేశారు.
