ఎలక్ట్రానిక్ డిటోనేటర్ల వినియోగం నిలిపివేయాలి…
- కార్మికుల భద్రతపై ఏఐటీయూసీ డిమాండ్
భూపాలపల్లి రూరల్, ఆంధ్రప్రభ : సింగరేణి గనుల్లో ఎలక్ట్రానిక్ డిటోనేటర్ల వినియోగంతో సాంకేతిక సమస్యలు తలెత్తుతున్న నేపథ్యంలో వాటి వినియోగాన్ని తాత్కాలికంగా నిలిపివేయాలని సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ) డిమాండ్ చేసింది. ఆదివారం భూపాలపల్లిలోని ఏఐటీయూసీ కొమురయ్య భవన్లో జరిగిన విలేకరుల సమావేశంలో బ్రాంచ్ కార్యదర్శి మోట పలుకుల రమేష్, నాయకుడు ఆసిఫ్ పాషా మాట్లాడారు.ఎలక్ట్రానిక్ డిటోనేటర్ల వల్ల పలు ‘నియర్ మిస్’ ఘటనలు చోటుచేసుకుంటున్నాయని, తడి ప్రాంతాల్లో బ్లాస్టింగ్ ఆలస్యమవడంతో పాటు కొన్ని సందర్భాల్లో డిజిటల్ సందేశాలు తప్పుగా ప్రదర్శితమవుతున్నాయని తెలిపారు.
కార్మికుల సందేహాలు పూర్తిగా నివృత్తి అయ్యే వరకు ఎలక్ట్రానిక్ డిటోనేటర్ల స్థానంలో ఎలక్ట్రిక్ డిటోనేటర్లనే ఉపయోగించాలని యాజమాన్యాన్ని కోరారు.మైనింగ్ సిబ్బందికి ప్రత్యేక శిక్షణ కల్పించాలని, ప్రమాదంలో గాయపడిన షార్ట్ ఫైరర్‌కు అన్ని విధాలా సహాయం అందించాలని, ఓపెన్‌కాస్ట్ గనుల్లో ఖాళీగా ఉన్న ఓవర్‌మెన్ పోస్టులను భర్తీ చేసి, అర్హులైన మైనింగ్ సర్దార్లకు పదోన్నతులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. సమావేశంలో ఏఐటీయూసీ నాయకులు మాతంగి రామచందర్, జి. శ్రీనివాస్, తాళ్ల పోశం తదితరులు పాల్గొన్నారు.
