కురవి పోలీస్ స్టేషన్ లో మానుకోట నేతలకు పరామర్శ..

కురవి పోలీస్ స్టేషన్ లో మానుకోట నేతలకు పరామర్శ..

  • పరామర్శించిన సిపిఐ జిల్లా కార్యదర్శి విజయసారథి
  • సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి నల్లు సుధాకర్ రెడ్డి

మహబూబాబాద్, ఆంధ్రప్రభ : మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని మోడల్ స్కూల్ సమీపంలో కొనసాగుతున్న భూ పోరాటం సందర్భంగా పేదలు ఏర్పాటు చేసుకున్న గుడిసెలను అధికారులు తొలగిస్తుండగా అడ్డుకున్న సీపీఐ నాయకులను పోలీసులు అరెస్టు చేయడం ఖండనీయమని సీపీఐ జిల్లా కార్యదర్శి బి. విజయసారథి అన్నారు.

సీపీఐ మహబూబాబాద్ పట్టణ కార్యదర్శి పెరుగు కుమార్, సహాయ కార్యదర్శి, 18వ వార్డు కౌన్సిలర్ రేశపల్లి నవీన్‌తో పాటు పట్టణ నాయకులు కూరాకుల పాల్, మంద శంకర్, బాలాజీలను పోలీసులు అదుపులోకి తీసుకుని కురవి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ నేపథ్యంలో సీపీఐ జిల్లా కార్యదర్శి బి. విజయసారథి, జిల్లా సహాయ కార్యదర్శి నల్లు సుధాకర్ రెడ్డి కురవి పోలీస్ స్టేషన్‌కు వెళ్లి అరెస్టయిన నాయకులను పరామర్శించారు.

ఈ సందర్భంగా విజయసారథి మాట్లాడుతూ, అరెస్టు చేసిన నాయకులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ భూములను ఆక్రమిస్తున్న పెద్దలను వదిలిపెట్టి, నిరుపేదలకు ఇంటి స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ పోరాడుతున్న సీపీఐ నాయకులను అరెస్టు చేయడం బాధాకరమన్నారు.

జిల్లా కేంద్రంలో సీపీఐ ఆధ్వర్యంలో గుడిసెవాసుల కోసం జరుగుతున్న భూ పోరాటానికి ప్రభుత్వం సానుకూలంగా స్పందించి ఇంటి స్థలాల పట్టాలు ఇవ్వడంతో పాటు ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయాలని కోరారు. అక్రమ అరెస్టులు, నిర్బంధాలతో భూ పోరాటాలను అణచివేయలేరని స్పష్టం చేశారు.

నిరుపేదలకు ఇంటి స్థలాలు, ఇంటి పట్టాలు అందే వరకు భారత కమ్యూనిస్టు పార్టీ పోరాటం కొనసాగిస్తుందని తెలిపారు. సీపీఐ మద్దతుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం గుడిసెవాసుల సమస్యలను పరిష్కరించి వారికి పట్టాలు, ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. పరామర్శ కార్యక్రమంలో కురవి మండల సీపీఐ నాయకులు కండెం వెంకన్న, తురక రమేష్, బుడమే వెంకన్న తదితరులు పాల్గొన్నారు.