పోలవరం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

బైక్‌ను ఢీకొన్న కారు.. భార్యాభర్తలు మృతి
మారేడుమిల్లి మండలం చీకటిగొప్పుల సమీపంలో ఘటన
విహారయాత్రకు వచ్చి తిరిగి వెళ్తుండగా విషాదం

మారేడుమిల్లి, ఆంధ్రప్రభ: పోలవరం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మారేడుమిల్లి మండలం చీకటిగొప్పుల సమీపంలో బైక్‌ను కారు ఢీకొన్న ఘటనలో భార్యాభర్తలు మృతి చెందారు. ఈ ప్రమాదంలో కోరుకొండ మండలం రాఘవపురానికి చెందిన శ్రీను, శోభారాణి దంపతులు ప్రాణాలు కోల్పోయారు. మారేడుమిల్లికి విహారయాత్ర కోసం వచ్చిన శ్రీను, శోభారాణి దంపతులు తిరిగి స్వగ్రామానికి బైక్‌పై వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. అదే సమయంలో జంగారెడ్డిగూడెంకు చెందిన కారు వారి బైక్‌ను ఢీకొట్టింది. ప్రమాద తీవ్రతకు దంపతులు అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని ప్రమాదానికి సంబంధించిన వివరాలను సేకరిస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.