early morning | ప్రభుత్వ భూముల అక్రమాలపై సంచలన ఆరోపణలు

early morning | ప్రభుత్వ భూముల అక్రమాలపై సంచలన ఆరోపణలు
early morning | ఆంధ్రప్రభ, వెబ్డెస్క్ : రంగారెడ్డి జిల్లాలో అవినీతి అధికారులపై యాంటీ కరప్షన్ బ్యూరో (ఏసీబీ) అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారన్న ఆరోపణల నేపథ్యంలో డిప్యూటీ కలెక్టర్ వంశీమోహన్ ఇళ్లు, కార్యాలయాలపై ఏసీబీ అధికారులు తెల్లవారుజాము నుంచే ఏకకాలంలో దాడులు నిర్వహించారు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోని మొత్తం 8 కీలక ప్రాంతాల్లో ఈ సోదాలు కొనసాగుతున్నాయి.
వంశీమోహన్ నివాసం, బంధువుల ఇళ్లు, కార్యాలయాల్లో ఏసీబీ బృందాలు విస్తృతంగా తనిఖీలు చేపట్టాయి. గతంలో పలు ప్రాంతాల్లో ఆర్డీవోగా పనిచేసిన ఆయన అధికార దుర్వినియోగానికి పాల్పడినట్లు ప్రాథమిక విచారణలో తేలినట్లు సమాచారం. ప్రభుత్వ భూములను ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టడం, వ్యక్తిగత లాభాల కోసం అధికారాన్ని వినియోగించుకున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

అబ్దుల్లాపూర్మెట్, పిగ్లీపురం ప్రాంతాల్లోని సుమారు 8ఎకరాల ప్రభుత్వ భూమిని నిబంధనలకు విరుద్ధంగా తన మామ పేరుతో రిజిస్ట్రేషన్ చేయించినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. అలాగే ఓ ప్రముఖ రియల్ ఎస్టేట్ వ్యాపారి నుంచి 10 ఓపెన్ ప్లాట్లను గిఫ్ట్ డీడ్ రూపంలో లంచంగా తీసుకున్నట్లు కూడా అనుమానిస్తున్నారు. ప్రభుత్వ భూముల క్లియరెన్స్, రియల్టర్లకు అనుకూల నిర్ణయాల బదులుగా ఈ లావాదేవీలు జరిగినట్లు అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం సోదాలు కొనసాగుతుండగా మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.
