2ndthought | పరాయి మోజు……కోల్పోతున్న జీవితాంతం నిలిచే బంధాలు
2ndthought | పరాయి మోజు……కోల్పోతున్న జీవితాంతం నిలిచే బంధాలు
2ndthought | పిల్లల మనసుల్లో పెరుగుతున్న భయం, ఒంటరితనం
సోషల్ మీడియా పరిచయాలు.. కొత్త ప్రమాద సంకేతాలా?
క్షణిక ఆకర్షణ కోసం జీవితాంతం బంధాలు కోల్పోతున్నారా?
మాట్లాడుకోలేకపోతే.. బంధాలు ఎందుకు కూలిపోతాయి?
నమ్మకం కోల్పోయిన తర్వాత తిరిగి నిలబడటం ఎందుకు కష్టం?
కుటుంబ బంధాలను కాపాడుకోవడానికి నిపుణుల సూచనలు
2ndthought | ఆంధ్రప్రభ వెబ్‌డెస్క్ : ఒకప్పుడు ఆ ఇంట్లో నవ్వులు వినిపించేవి…
పిల్లల అల్లరి, భార్యాభర్తల చిన్న చిన్న మాటలు, అందరూ కలిసి చేసిన భోజనాల సందడి…సంతోషం… అన్నీ ఆ ఇంటిని నందనవనంలా అనిపించేవి.. కానీ ఇప్పుడు… అదే ఇంట్లో నిశ్శబ్దం. ఒకరిపై ఒకరికి అనుమానం. పిల్లల కళ్లలో భయం. మాటలు కలిసినట్టే ఉన్నా మనసులు కలిసి లేని జీవితం.
కానీ, అవన్నీ ఒక్కసారిగా, ఒక్కరోజులో మారిపోలేదు.
ఎక్కడో చిన్న దూరం మొదలైంది…ఒక చిన్న తప్పటడుగు…జీవిత నడకనే తప్పు దారిలోకి తీస్కెళ్ళింది. కలిసి సాగాల్సిన ఇద్దరి దార్లూ వేరయ్యాయి.
ఆ దూరాన్ని “పరాయి మోజు” అనే ఆకర్షణ నెమ్మదిగా పెద్ద గోడగా మార్చింది. ఆ గోడ…బద్దలు కొట్టలేనంత పెద్దగా పెరిగితే..?

వివాహం అనేది కేవలం ఇద్దరు వ్యక్తులు కలిసి జీవించడం కాదు. అది పరస్పర నమ్మకం, బాధ్యత, గౌరవం, భావోద్వేగ అనుబంధంతో నిలిచే నూరేళ్ళ బంధం. ఒకరి చేతిని ఒకరు పట్టుకుని జీవితంలోని కష్టసుఖాలను పంచుకునే ప్రయాణం. కానీ కొన్నిసార్లు ఆ బంధంలోకి మూడో వ్యక్తి ప్రవేశించినప్పుడు… కళ్లకు కనిపించని చీలికలు కుటుంబాన్ని లోపల్నుంచే వికటింపజేస్తాయి.
ఇటీవలి కాలంలో వివాహేతర సంబంధాలు, పరాయి వ్యక్తులపై పెరుగుతున్న ఆకర్షణ అనేక కుటుంబాల్లో కలహాలకు, విడాకులకు, కొన్ని సందర్భాల్లో ఘోర సంఘటనలకు కూడా కారణమవుతున్నాయి. మొదట సాధారణ పరిచయంగా ప్రారంభమయ్యే సంబంధాలు… తర్వాత భావోద్వేగ ఆధారపడటానికి, అక్కడి నుంచి కుటుంబ బంధాల పతనానికి దారి తీస్తున్నాయని మానసిక నిపుణులు చెబుతున్నారు.
రమేష్, సుజాత (పేర్లు మార్చబడినవి) దంపతుల జీవితమే దీనికి ఉదాహరణ.
బయటకు చూస్తే ఎంతో ఆనందంగా కనిపించే ఆ కుటుంబం. ఉద్యోగం, పిల్లలు, చిన్న చిన్న కలలు… అన్నీ సవ్యంగానే సాగుతున్నట్టు కనిపించేవి. కానీ ఆఫీసులో పరిచయమైన మరో మహిళతో రమేష్‌కు పెరిగిన ఆకర్షణ అతని జీవితాన్ని నెమ్మదిగా మార్చేసింది. మొదట అది “స్నేహం”గానే అనిపించింది. తర్వాత ఆ పరిచయం అతని సమయాన్ని, ఆలోచనలను, భావోద్వేగాలను పూర్తిగా ఆక్రమించింది.
ఇంట్లో భార్యతో గడిపే సమయం తగ్గిపోయింది. పిల్లల నవ్వులు వినిపించలేదు. ఫోన్‌లో గంటల తరబడి మాట్లాడే వ్యక్తి… ఇంట్లో మాత్రం నిశ్శబ్దంగా మారిపోయాడు. సుజాత మొదట ఈ మార్పును అర్థం చేసుకోలేకపోయింది. “పని ఒత్తిడి కావచ్చు” అనుకుంది. కానీ రోజులు గడిచేకొద్దీ నిజం బయటపడింది.
ఆ క్షణం నుంచి ఆ ఇంట్లో ప్రశాంతత కరువైంది.
భార్యాభర్తల మధ్య మాటలు తగ్గాయి.
పిల్లలు తల్లిదండ్రుల మధ్య పెరుగుతున్న దూరాన్ని గమనిస్తూ మానసికంగా కృంగిపోయారు.
చివరకు రమేష్ గ్రహించిన నిజం ఒక్కటే —
క్షణిక ఆకర్షణ కోసం… నిజంగా ప్రేమించిన వారినే కోల్పోతున్నానని.
మానసిక నిపుణుల అభిప్రాయం ప్రకారం… పరాయి ఆకర్షణకు అనేక కారణాలు ఉంటాయి. భార్యాభర్తల మధ్య సరైన సమయం లేకపోవడం, భావోద్వేగ దూరం పెరగడం, రోజువారీ జీవితంలోని విసుగు, ఒంటరితనం, నిరంతర గొడవలు, పరస్పర నమ్మకం తగ్గిపోవడం వంటి అంశాలు ఈ పరిస్థితులకు దారితీస్తాయి. ఆధునిక సాంకేతికత, సోషల్ మీడియా, డేటింగ్ యాప్స్ ద్వారా కొత్త పరిచయాలు సులభంగా ఏర్పడటం కూడా ఒక ప్రధాన కారణంగా మారిందని మానసిక నిపుణులు చెబుతున్నారు.
అయితే ప్రతి సమస్యకు పరిష్కారం విడిపోవడమే కాదు. సమస్యలు వచ్చినప్పుడు పరస్పరం మాట్లాడుకోవడం, మనసులోని బాధలను పంచుకోవడం, ఒకరికొకరు సమయం కేటాయించడం చాలా ముఖ్యం అని సూచిస్తున్నారు. పరిస్థితులు అదుపు తప్పుతున్నాయని అనిపిస్తే రిలేషన్షిప్ కౌన్సెలర్లు, మానసిక నిపుణులను సంప్రదించడం మంచిది.
పరాయి మోజు కొన్ని క్షణాల మాయ మాత్రమే కావచ్చు…
కానీ అది విరిచే బంధాలు జీవితాంతం మిగిలే గాయాలు అవుతాయి.
నమ్మకం కోల్పోయిన తర్వాత…
కుటుంబాన్ని మళ్లీ మొదటి స్థితికి తీసుకురావడం చాలా కష్టం.
అందుకే…
కుటుంబం అనే బంధాన్ని కాపాడుకోవాలంటే ప్రేమతో పాటు బాధ్యత, ఆకర్షణతో పాటు ఆత్మ నియంత్రణ, సంబంధంతో పాటు పరస్పర గౌరవం కూడా అవసరమని నిపుణులు చెబుతున్నారు.
