మ‌త్తుకు బానిస‌…

  • మ‌హీంద్రా యూనివ‌ర్సిటీలో డ్ర‌గ్స్ క‌ల‌క‌లం
  • 50 మంది విద్యార్థుల‌కు డ్ర‌గ్స్ పాజిటివ్‌

హైదరాబాద్ : తెలంగాణలోని విద్యాసంస్థల్లో డ్రగ్స్ భూతం చొరబడింది. బాచుపల్లి మహీంద్రా విశ్వవిద్యాలయంలో మాదకద్రవ్యాల కేసు వెలుగులోకి రావడం కలకలం రేపుతోంది. ఒక‌ రెస్టారెంట్ యజమాని ఇచ్చిన సమాచారం మేరకు మంగళవారం తెలంగాణ యాంటీ-నార్కోటిక్స్ స్క్వాడ్ (ఈగ‌ల్ టీం) మహీంద్రా విశ్వవిద్యాలయంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించింది.

ఈ క్రమంలో గంజాయి సేవిస్తున్న విద్యార్థులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. ఈ దాడిలో ఇద్దరు విద్యార్థులు సహా మొత్తం నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. ఒకటిన్నర కిలోల గంజాయి, 47 గ్రాముల ఓజీ గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.

మణిపూర్‌కు చెందిన ఒక విద్యార్థి ఢిల్లీలోని ఒక ముఠా నుండి కొరియర్ ద్వారా డ్రగ్స్‌ను కొనుగోలు చేసినట్లు దర్యాప్తులో తేలింది. వాటిని గంజాయిలో కలిపి సిగరెట్లుగా తయారు చేసి ఇతర విద్యార్థులకు విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.

ఈ ఘటనతో యూనివర్సిటీలో డ్రగ్స్ వాడకం విస్తృత స్థాయిలో జరుగుతోందన్న విషయం బయటపడింది. మరో 50 మంది విద్యార్థులు మత్తుకు బానిసలైనట్టు అధికారులు గుర్తించారు. డ్ర‌గ్స్ టెస్టులో పాజిటివ్ అని తేలిన ఆ 50 మందికి కౌన్సెలింగ్ ఇచ్చారు. ఈ పరిణామంపై మహీంద్రా విశ్వవిద్యాలయ యాజమాన్యం ఇంకా అధికారికంగా స్పందించాల్సి ఉంది.