శాంతినగర్ విద్యార్థులకు కెనరా బ్యాంక్ మెరిట్ స్కాలర్‌షిప్

  • విద్యార్థులకు ఆర్థిక అవగాహనపై వ్యాసరచన, చిత్రలేఖన పోటీలు

ఖమ్మం ఎడ్యుకేషన్, ఆంధ్రప్రభ: స్థానిక శాంతినగర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులకు కెనరా బ్యాంక్ మమతా బ్రాంచ్ అధికారులు మెరిట్ స్కాలర్‌షిప్‌లు అందజేశారు. పాఠశాలలో చదువుతున్న ఎస్సీ, ఎస్టీ విద్యార్థినుల్లో ప్రతి తరగతిలో మెరిట్‌లో నిలిచిన ఒక్కొక్కరికి స్కాలర్‌షిప్‌లు మంజూరు చేసి అందజేశారు. 5వ తరగతి విద్యార్థిని జ్ఞానేశ్వరి కూచావల్లాల్ స్కూల్, 6వ తరగతి నుంచి శివగామినీదేవి, 7వ తరగతి నుంచి కె. ఆలివ్‌లకు రూ.3 వేల చొప్పున స్కాలర్‌షిప్‌లు అందజేశారు.

8వ తరగతి నుంచి సహస్ర, 9వ తరగతి నుంచి ఆర్. మహి, 10వ తరగతి నుంచి కె. సమంతకు రూ.5 వేల చొప్పున మెరిట్ స్కాలర్‌షిప్‌లు అందజేశారు. విద్యార్థినుల ఉన్నత విద్యకు ఆర్థిక సహకారం అందిస్తున్న కెనరా బ్యాంక్ మమతా బ్రాంచ్ మేనేజర్ కొనగంటి ప్రవీణ్ కుమార్, అసిస్టెంట్ మేనేజర్ రాయల మారేశ్వరరావు, క్యాషియర్ ఎస్. రాంబాబు చేతుల మీదుగా మెరిట్ విద్యార్థినులకు స్కాలర్‌షిప్‌లు అందజేశారు. ఇదే విధంగా ప్రతి సంవత్సరం తమ కెనరా బ్యాంక్ తరఫున మెరిట్ స్కాలర్‌షిప్‌లు అందజేస్తామని బ్యాంక్ అధికారులు విద్యార్థులకు తెలిపారు.

ఆర్థిక అక్షరాస్యతపై వ్యాసరచన పోటీలు..

విద్యార్థుల్లో ఆర్థిక విషయాలపై అవగాహన పెంపొందించేందుకు ‘విద్యార్థి జీవితంలో ఆర్థిక అక్షరాస్యత ప్రాధాన్యత’ అనే అంశంపై వ్యాసరచన పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో జూనియర్ విభాగంలో కె. భవానీ, టి. నందవికాస్, సీనియర్ విభాగంలో తేజస్విని, ఎం. మీనాక్షి విజేతలుగా నిలిచారు. వారికి తెలంగాణ గ్రామీణ బ్యాంక్ చర్చి రోడ్ మేనేజర్ అనిల్ కుమార్ బహుమతులు, ప్రశంసా పత్రాలు అందజేశారు.
చిన్న వయసు నుంచే పొదుపు, బ్యాంకింగ్, ఆర్థిక ప్రణాళిక, బాధ్యతాయుతమైన ఆర్థిక నిర్వహణపై అవగాహన కలిగి ఉండటం ఎంతో అవసరమని ఈ సందర్భంగా వక్తలు పేర్కొన్నారు.

చిత్రలేఖన పోటీల్లో ప్రతిభ..

అగస్త్య ఫౌండేషన్ సహకారంతో నిర్వహించిన చిత్రలేఖన పోటీల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. విద్యార్థుల్లో సృజనాత్మకతను, కళాత్మక ప్రతిభను వెలికితీయడంలో ఇటువంటి పోటీలు ఎంతో దోహదపడతాయని ప్రధానోపాధ్యాయులు చల్లగాని కృపా బాలానందం పేర్కొన్నారు.

విద్యార్థుల్లో దేశభక్తి, సామాజిక బాధ్యత, ఆర్థిక అవగాహన, సృజనాత్మకత వంటి విలువలను పెంపొందించడమే పాఠశాల లక్ష్యమని తెలిపారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు మేడికొండ డాన్ బాస్కో, జీపీఎస్ కూచావల్లాల్ ప్రధానోపాధ్యాయులు జీవన్, ఇతర ఉపాధ్యాయులు, విద్యార్థులు, బ్యాంకు ప్రతినిధులు, పూర్వ ప్రధానోపాధ్యాయులు రామారావు, ఫౌండేషన్ ప్రతినిధులు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.