ఏపీ ఫారెస్ట్‌ అకాడమీలో డిజిటల్‌ ఎక్సలెన్స్‌ హ్యాకథాన్‌

రాజమహేంద్రవరం, ఆంధ్రప్రభ: యువత ఆలోచనలకు సాంకేతికత తోడైతే అటవీ పరిరక్షణలో మరిన్ని వినూత్న మార్గాలను ఆవిష్కరించవచ్చని ఉప ముఖ్యమంత్రి, అటవీ, పర్యావరణ, శాస్త్ర సాంకేతిక, వాతావరణ శాఖల మంత్రి పవన్‌ కల్యాణ్‌ పేర్కొన్నారు. అటవీ శాఖలో సాంకేతికత, ఆవిష్కరణలు, యువ ప్రతిభకు ప్రాధాన్యం కల్పించాలనే లక్ష్యంతో రాజమహేంద్రవరంలోని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర అటవీ అకాడమీలో తొలిసారిగా డిజిటల్‌ ఎక్సలెన్స్‌ హ్యాకథాన్‌–2026 నిర్వహించారు.

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర అటవీ అకాడమీ, గోదావరి గ్లోబల్‌ యూనివర్సిటీ సంయుక్త ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో ఐటీ, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ ఇంజినీరింగ్‌ విభాగాలకు చెందిన 50 మంది విద్యార్థులు ఆరు బృందాలుగా పాల్గొన్నారు. అటవీ అకాడమీ అవసరాలను దృష్టిలో ఉంచుకుని డిజిటల్‌, ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌, మొబైల్‌, వెబ్‌ ఆధారిత పరిష్కారాలను విద్యార్థులు రూపొందించారు.

ఆరు కీలక అంశాలపై వినూత్న పరిష్కారాలు..

హ్యాకథాన్‌లో భాగంగా అటవీ అకాడమీకి ఉపయోగపడే ఆరు కీలక అంశాలపై విద్యార్థులు సాంకేతిక పరిష్కారాలను అభివృద్ధి చేశారు. ఇందులో అకాడమీ డిజిటల్‌ వెబ్‌ పోర్టల్‌, లెర్నింగ్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌, శిక్షణార్థుల అకడమిక్‌ డ్యాష్‌బోర్డ్‌, బయోమెట్రిక్‌–ఆరోగ్య పర్యవేక్షణ వ్యవస్థ, కృత్రిమ మేధ ఆధారిత అభిప్రాయ విశ్లేషణ, జీఐఎస్‌–జీపీఎస్‌ ఆధారిత స్మార్ట్‌ హాజరు వ్యవస్థ ఉన్నాయి.

విద్యార్థులు రూపొందించిన పరిష్కారాలు అటవీ అకాడమీ కార్యకలాపాలను మరింత సులభతరం చేయడంతో పాటు శిక్షణ, హాజరు, ఆరోగ్య పర్యవేక్షణ, అభిప్రాయాల విశ్లేషణ వంటి అంశాల్లో సాంకేతికతను సమర్థంగా వినియోగించుకునేలా ఉన్నాయి.

యువత సృజనాత్మకత అనుసంధానం..

యువతలోని సృజనాత్మక ఆలోచనలు, సాంకేతిక నైపుణ్యాలను అటవీ శాఖ అవసరాలతో అనుసంధానించడం ద్వారా భవిష్యత్తులో ఎదురయ్యే సవాళ్లకు ముందుగానే సాంకేతిక పరిష్కారాలను సిద్ధం చేయవచ్చని అధికారులు తెలిపారు.

ముఖ్యంగా మానవ–వన్యప్రాణి సంఘర్షణ వంటి సవాళ్లకు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి పరిష్కారాలను అభివృద్ధి చేసే దిశగా హ్యాకథాన్‌ను భవిష్యత్తులో మరింత విస్తరించనున్నట్లు తెలిపారు. అటవీ పరిరక్షణలో యువత భాగస్వామ్యాన్ని పెంచడంతో పాటు కొత్త ఆలోచనలకు వేదికగా ఇటువంటి కార్యక్రమాలను కొనసాగించనున్నారు.

పవన్‌ కల్యాణ్‌ అభినందనలు..

ఈ వినూత్న కార్యక్రమాన్ని ముందుండి నిర్వహించిన ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర అటవీ అకాడమీ డైరెక్టర్‌ బి. విజయ్‌కుమార్‌, ఐఎఫ్‌ఎస్‌ను ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ అభినందించారు. కార్యక్రమానికి మార్గదర్శకత్వం అందించిన అటవీ శాఖ పీసీసీఎఫ్‌ అండ్‌ హెచ్‌వోఎఫ్‌ఎఫ్‌ చలపతి రావు, ఐఎఫ్‌ఎస్‌, అటవీ శాఖ సలహాదారు మల్లికార్జునరావు, ఐఎఫ్‌ఎస్‌, అటవీ శాఖ ఐటీ సలహాదారు పెన్నమరెడ్డి నాగేశ్వరరావులను కూడా అభినందించారు.

యువ ప్రతిభకు వేదిక కల్పిస్తూ సాంకేతికతను అటవీ పరిరక్షణతో అనుసంధానించే ఇలాంటి కార్యక్రమాలు అటవీ శాఖలో డిజిటల్‌ పరివర్తనకు బలమైన పునాది వేస్తాయని పవన్‌ కల్యాణ్‌ పేర్కొన్నారు. భవిష్యత్తులో మరిన్ని సాంకేతిక ఆవిష్కరణలను అటవీ రంగంలోకి తీసుకురావడానికి యువతను ప్రోత్సహించాలని సూచించారు.