Tirumala | పవన్ ఆరోగ్యం కోసం ప్రత్యేక పూజలు..

Tirumala | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సతీమణి అన్నా లెజినోవా తిరుమల శ్రీవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. శనివారం తెల్లవారుజామున జరిగిన సుప్రభాత సేవలో పాల్గొని శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు.

అలిపిరి నుంచి కాలినడకన తిరుమల కొండకు చేరుకున్న లెజినోవా, క్షేత్ర సంప్రదాయం ప్రకారం ముందుగా శ్రీ భూవరాహస్వామిని దర్శించుకున్నారు. అనంతరం వైకుంఠం క్యూ కాంప్లెక్స్-1 ద్వారా ఆలయానికి చేరుకోగా, టీటీడీ డిప్యూటీ ఈవో (ఆర్-1) భాస్కర్ ఆమెకు స్వాగతం పలికారు. ప్రత్యేక ప్రవేశ దర్శన మార్గంలో స్వామివారిని దర్శించుకుని అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితుల ఆశీర్వాదం అందుకున్నారు. అధికారులు తీర్థప్రసాదాలు అందజేశారు.

శ్రీవారి దర్శనం అనంతరం ఆలయం ఎదురుగా ఉన్న అఖిలాండం వద్ద కొబ్బరికాయలు కొట్టి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం బేడి ఆంజనేయస్వామిని కూడా దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.

ఇటీవల ముంబైలో పవన్ కళ్యాణ్‌కు కుడి భుజానికి విజయవంతంగా శస్త్రచికిత్స జరగడంతో మొక్కు తీర్చుకునేందుకు అన్నా లెజినోవా తిరుమలకు వచ్చినట్లు సమాచారం. గతంలో కుమారుడు మార్క్ శంకర్ పవనోవిచ్ సింగపూర్‌లో జరిగిన అగ్నిప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడిన అనంతరం కూడా ఆమె తిరుమలకు వచ్చి తలనీలాలు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు. డిప్యూటీ సీఎం సతీమణి అయినప్పటికీ ఎలాంటి హడావుడి, ఆడంబరాలకు తావు ఇవ్వకుండా, సాధారణ భక్తురాలిలా దర్శనం చేసుకోవడం పలువురి దృష్టిని ఆకర్షించింది.