పొలాల్లో చెత్త దహనం..

పొలాల్లో చెత్త దహనం..
- రైతుల నిర్లక్ష్యమా? ప్రమాదాలకు ఆహ్వానమా?
- మొక్కజొన్న చెత్త, వరిగడ్డి కాల్చివేతతో కాలుష్యం..
- పంటలు, పశుగ్రాసం, వ్యవసాయ పరికరాలకు ముప్పు
- అవగాహన కల్పిస్తున్నా వినిపించని కొందరు రైతులు
- అప్రమత్తంగా ఉండాలని వ్యవసాయ శాఖ హెచ్చరికలు
నర్సంపేట రూరల్, ఆంధ్రప్రభ : నర్సంపేట డివిజన్ పరిధిలోని పలు గ్రామాల్లో మొక్కజొన్న, వరి పంటల కోత అనంతరం పొలాల్లో మిగిలిపోయిన చెత్త, వరిగడ్డి, మొక్కజొన్న అవశేషాలను కొందరు రైతులు కాల్చివేస్తుండటంపై ఇతర రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
పంట అవశేషాలను అగ్నికి ఆహుతి చేయడం వల్ల పర్యావరణ కాలుష్యం పెరగడమే కాకుండా, సమీపంలోని పంట పొలాలు, పశుగ్రాసం, డ్రిప్ పైపులు, మోటార్లు, వ్యవసాయ పరికరాలు, పొలాలకు దగ్గర్లో ఉన్న ఇళ్లు ప్రమాదానికి గురయ్యే అవకాశాలు ఉన్నాయని రైతులు చెబుతున్నారు.

కొన్ని సందర్భాల్లో చిన్న మంటలు గాలివేగంతో పెద్ద ప్రమాదాలకు దారి తీసే పరిస్థితులు నెలకొంటున్నాయని స్థానికులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా వేసవి ఎండల సమయంలో పొలాల్లో మంటలు వ్యాపిస్తే కోట్ల రూపాయల నష్టం సంభవించే అవకాశం ఉందని పేర్కొంటున్నారు.
ఇప్పటికే వ్యవసాయ శాఖ అధికారులు గ్రామాల్లో రైతులకు అవగాహన సదస్సులు నిర్వహిస్తూ పంట అవశేషాలను కాల్చవద్దని పలు మార్లు సూచనలు చేస్తున్నప్పటికీ, కొందరు రైతులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ చెత్తను దహనం చేస్తున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

వ్యవసాయ అధికారులు మాట్లాడుతూ.. పంట అవశేషాలను కాల్చడం వల్ల భూమిలో ఉండే సూక్ష్మజీవులు నశించి, నేల సారవంతత తగ్గిపోతుందని తెలిపారు. అదే చెత్తను పొలంలోనే చర్చలు వేసి నీరు పోసి కంపోస్టుగా మార్చుకుంటే, అది మళ్లీ భూమికి సేంద్రియ ఎరువుగా ఉపయోగపడుతుందని వివరించారు.
అదేవిధంగా వరిగడ్డి, మొక్కజొన్న చెత్త పశువులకు మేతగా ఉపయోగపడే అవకాశం ఉండగా, దాన్ని కాల్చివేయడం రైతులకే నష్టమని పేర్కొన్నారు. పంట అవశేషాలను దహనం చేయకుండా శాస్త్రీయ పద్ధతుల్లో వినియోగించుకోవాలని సూచించారు.
ఏదైనా ప్రమాదం జరిగి ఇతర రైతులకు లేదా ప్రజలకు నష్టం కలిగితే బాధ్యత వహించాల్సి వస్తుందని అధికారులు హెచ్చరిస్తున్నారు. రైతులు అప్రమత్తంగా ఉండి, అగ్రికల్చర్ శాఖ సూచనలు తప్పనిసరిగా పాటించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
గ్రామస్థాయిలో మరింత విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించి, చెత్త దహనం వల్ల కలిగే నష్టాలపై రైతులకు మరోసారి స్పష్టమైన అవగాహన కల్పించాలని పలువురు రైతులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
