మట్టపల్లి గౌడ అన్నదాన సత్రానికి విరాళాల సేకరణ
గరిడేపల్లి, ఆంధ్రప్రభ ; మట్టపల్లి శ్రీ లక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో జరగనున్న శ్రీ లక్ష్మీనరసింహస్వామి కళ్యాణోత్సవాన్ని పురస్కరించుకుని అన్నదాన కార్యక్రమానికి ప్రతి గౌడ కులస్తుడు సహకరించాలని గౌడ అన్నదాన సత్రం చైర్మన్ దొంతగాని రాములు గౌడ్ కోరారు. మండలంలోని సర్వారం గ్రామంలో శనివారం గౌడ అన్నదాన సత్రం తరఫున విరాళాల సేకరణకు ఆయన శ్రీకారం చుట్టారు. మట్టపల్లి క్షేత్రంలో భక్తులకు అన్నదానం నిర్వహించేందుకు కౌండిన్య వంశీయులు ముందుకు వచ్చి విరాళాలు అందించాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా గౌడ అన్నదాన సత్రం ప్రధాన కార్యదర్శి గుండు గురవయ్య గౌడ్, కార్యదర్శి అంజయ్య గౌడ్ మాట్లాడుతూ అన్నదానం మహాదానం అని, భక్తి భావంతో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నేలపట్ల అంజయ్య, యరగాని గురవయ్య, బత్తిని సీతారాములు, దొంతగాని మట్టపల్లి, పెండెం కోటేశ్వరరావు, గుండు బాలకృష్ణ, పెండెం సతీష్ తదితరులు పాల్గొన్నారు.
