పంటల వైవిధ్యంతో స్థిరమైన ఆదాయం..
సుస్థిర వ్యవసాయానికి బాట
తొర్రూరు రూరల్, ఆంధ్రప్రభ : వాతావరణ మార్పులు, అస్థిర వర్షపాతం, సాగు ఖర్చుల పెరుగుదల, మార్కెట్ ధరల హెచ్చుతగ్గుల నేపథ్యంలో రైతులు ఒకే పంటపై ఆధారపడకుండా పంటల వైవిధ్యాన్ని అవలంబించాలని మండల వ్యవసాయ అధికారి డి. రామ్ నర్సయ్య సూచించారు. తొర్రూరు మండలం వెలికట్ట గ్రామంలో గురువారం నిర్వహించిన మిషన్ పంటల వైవిధ్యం కార్యక్రమంలో రైతులకు పంటల వైవిధ్యంపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వ్యవసాయ అధికారి మాట్లాడుతూ.. నేల స్వభావం, నీటి లభ్యత, వాతావరణ పరిస్థితులు, మార్కెట్ డిమాండ్‌కు అనుగుణంగా వివిధ రకాల పంటలను సాగు చేయడం ద్వారా రైతులు పంట నష్టాలను తగ్గించుకొని స్థిరమైన ఆదాయాన్ని పొందవచ్చన్నారు.
నీటి లభ్యత తక్కువగా ఉన్న ప్రాంతాల్లో వరి విస్తీర్ణాన్ని తగ్గించి కంది, పెసర, మినుము, అలసంద, వేరుశనగ, జొన్న, సజ్జ, కొర్ర, రాగులు వంటి తక్కువ నీటితో సాగయ్యే పంటలకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. అంతర పంటలు, మిశ్రమ పంటల సాగును ప్రోత్సహించడంతో పాటు మట్టి పరీక్షల ఆధారంగా ఎరువులు వినియోగించాలని తెలిపారు. ఫామ్ పాండ్లు, చెక్‌డ్యాంలు వంటి నీటి సంరక్షణ చర్యల ద్వారా వర్షపు నీటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పంటల వైవిధ్యం ద్వారా వర్షాభావం, వాతావరణ మార్పుల ప్రభావాన్ని తగ్గించుకోవడంతో పాటు సాగు ఖర్చులను నియంత్రించుకోవచ్చని, నేల సారాన్ని కాపాడుకోవచ్చని అధికారులు వివరించారు. అలాగే చీడపీడల ఉధృతి తగ్గి, రైతులకు వివిధ మార్గాల్లో ఆదాయం లభించే అవకాశం ఉంటుందని తెలిపారు. ఇదే కార్యక్రమంలో భాగంగా మండలంలోని గుర్తూరు, వెంకటాపురం, బొంతుపల్లి, ఖానాపురం గ్రామాల్లోనూ ఆయా వ్యవసాయ విస్తరణ అధికారులు మిషన్ పంటల వైవిధ్యం కార్యక్రమాలను నిర్వహించి రైతులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమాల్లో వ్యవసాయ విస్తరణ అధికారులు ఎన్. వినయ్ వర్మ, ఎం. జమున, ఎం. భరత్ చంద్ర, దీపిక, ప్రవీణ్, ఆయా గ్రామాల సర్పంచులు, రైతులు పాల్గొన్నారు.
