ఆలయ ట్రస్ట్ బోర్డు ఏర్పాటుకు ముందడుగు

గుమ్మడిదల (ఆంధ్రప్రభ): సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం బొంతపల్లి వీరన్నగూడెంలోని శ్రీ భద్రకాళి సమేత వీరభద్రస్వామి దేవాలయానికి ట్రస్ట్ బోర్డు ఏర్పాటు దిశగా కీలక ముందడుగు పడింది. ట్రస్ట్ బోర్డు ఏర్పాటుకు నోటిఫికేషన్ జారీ ప్రక్రియను ప్రారంభించాలని దేవాదాయ శాఖ ఆదేశాలు జారీ చేసింది.

తెలంగాణ ప్రభుత్వ రెవెన్యూ (దేవాదాయాలు–II) శాఖ జారీ చేసిన మెమో మేరకు దేవాదాయ శాఖ అదనపు కమిషనర్ కె. జ్యోతి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు మెదక్ దేవాదాయ శాఖ సహాయ కమిషనర్‌తో పాటు బొంతపల్లి శ్రీ వీరభద్రస్వామి దేవాలయ కార్యనిర్వహణాధికారికి నోటిఫికేషన్ జారీ ప్రక్రియ చేపట్టాలని ఆదేశించారు. స్థానిక పత్రికలో ప్రకటన విడుదల చేసిన అనంతరం ట్రస్ట్ బోర్డు సభ్యుల నియామక ప్రక్రియ ప్రారంభం కానుంది.

ఈ పరిణామంతో బొంతపల్లి శ్రీ వీరభద్రస్వామి దేవాలయ ట్రస్ట్ బోర్డు ఏర్పాటుకు మార్గం సుగమమైందని భక్తులు, స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.