Chevella | భయంతో బయటకు పరుగులు
Chevella | భయంతో బయటకు పరుగులు
Chevella | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లా చేవేళ్ల పట్టణం, పరిసర ప్రాంతాల్లో ఇవాళ ఉదయం ఒక్కసారిగా భూమి కంపించడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. భారీ శబ్ధంతో కూడిన ఈ ప్రకంపనల ధాటికి ప్రజలు ఏం జరుగుతుందోనని భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.
ఇవాళ ఉదయం సుమారు 9:30 గంటల సమయంలో అకస్మాత్తుగా గట్టిగా శబ్ధం వినిపించిందని, కొన్ని క్షణాల పాటు భూమి స్వల్పంగా కంపించినట్లు అనిపించిందని స్థానికులు తెలిపారు. భూ ప్రకంపనల కారణంగా ఇళ్లలోని వస్తువులు కదలడం, పాత్రలు శబ్ధం చేయడంతో ప్రజలు మరింత ఆందోళనకు గురయ్యారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. ఇది భూకంపమా లేక సమీపంలోని క్వారీల్లో జరిగిన పేలుళ్ల వల్ల వచ్చిన ప్రకంపనలా అనే కోణంలో విచారణ జరుపుతున్నారు.
