Iragavaram | కాలువలోకి దూసుకెళ్లిన కారు…
నలుగురు ఇంజనీరింగ్ విద్యార్థుల గల్లంతు
క్షేమంగా బయటపడిన మరో విద్యార్థి
ఇరగవరం మండలం ఐతంపూడి వద్ద ఘటన
ఘటన స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే రాధాకృష్ణ
గల్లంతయిన వరంతా తూర్పుగోదావరి జిల్లా వాసులు
Iragavaram | ఇరగవరం, ఆగస్టు 16 (ఆంధ్రప్రభ): పశ్చిమగోదావరి జిల్లా ఇరగవరం మండలంలో ఇవాళ తెల్లవారుజామున తీవ్ర విషాదం చోటుచేసుకుంది. మండలం పరిధిలోని ఐతంపూడి లాకులు సమీపంలో ఒక కారు అదుపుతప్పి కాలువలోకి దూసుకు వెళ్ళింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఐదుగురు గల్లంతు కాగా.. ఒకరు సురక్షితంగా బయటపడ్డారు.

నరసాపురం స్వర్ణాంధ్ర ఇంజనీరింగ్ కళాశాలలో రెండో సంవత్సరం చదువుతున్న విద్యార్థులు ఆచంట మండలం వల్లూరుకు చెందిన మట్ట సతీష్, మోరి గ్రామానికి చెందిన నాగబత్తుల తేజ సాయి సూర్య, చెరుకూరి రాజా రామ్ చరణ్, పోతుల లక్ష్మీ భాను వికాస్ అభిరామ్, నాగిరెడ్డి దుస్వంత్ సాయి శనివారం రాత్రి పెరవలిలో జరిగిన వివాహానికి హాజరయ్యారు.
అనంతరం ఇరగవరం మండలం ఓగిడి గ్రామంలో పెళ్ళికొడుకు నివాసానికి వచ్చిన వీరంతా తిరిగి అర్ధరాత్రి దాటిన తర్వాత కారులో బయలుదేరారు. ఓగిడి నుంచి ఐతంపూడి వెళ్లే దారిలో మలుపు వద్ద కారు అదుపుతప్పి పెరవలి – నరసాపురం కాలువలోకి దూసుకెళ్లింది.

ఈ ప్రమాదంలో గణేష్ ను స్థానికులు రక్షించి వెలికితీశారు. మిగిలిన నలుగురు యువకులు నీటి ప్రవాహంలో గల్లంతయ్యారు. ఘటనా స్థలానికి స్థానిక ఎమ్మెల్యే ఆరుమెల్లి రాధాకృష్ణ విచ్చేసి ప్రమాదం జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. ఎస్ డి ఆర్ ఎఫ్, గజ ఈతగాళ్లు సాయంతో గల్లంతైన నలుగురు విద్యార్థుల ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు తెలిపారు.

బాధిత కుటుంబాలకు ప్రభుత్వం తరఫున అండగా ఉంటామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. సంఘటన స్థలాన్ని తాడేపల్లిగూడెం డిఎస్పి యు.రవిచంద్ర, తణుకు రూరల్, టౌన్ సిఐలు డి.వెంకటేశ్వరరావు, జేవి రమణ పరిశీలించి రక్షణ చర్యలు చేపట్టారు. గల్లంతైన నలుగురు విద్యార్థుల ఆచూకీ కోసం పోలీసు, రెవెన్యూ, ఫైర్ సిబ్బంది ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. ఆదివారం మధ్యాహ్నం సమయానికి నాగిరెడ్డి దుస్వంత్ సాయి, పోతుల లక్ష్మి భాను వికాస్ అభిరామ్ మృతదేహాలను వెలికితీశారు. మృతుల కుటుంబ సభ్యులు రోదనలతో ఈ ప్రాంతం దద్దరిల్లిపోయింది.
