ఎల్‌నినో పంజా.. జిల్లాలో కరువు ఛాయలు

వానల కోసం ఎదురుచూపులు..
ఎండుతున్న చేలు.. ఆందోళనలో అన్నదాతలు
వేరుశనగ సాగుపై తీవ్ర ప్రభావం..
అడుగంటుతున్న భూగర్భ జలాలు
తాగునీటి భద్రతపై ముందస్తు చర్యలకు అవసరం

శ్రీ సత్యసాయి బ్యూరో, ఆంధ్రప్రభ : శ్రీ సత్యసాయి జిల్లాను వర్షాభావ పరిస్థితులు వెంటాడుతున్నాయి. ఖరీఫ్ సీజన్ కీలక దశకు చేరుకున్నప్పటికీ ఆశించిన స్థాయిలో వర్షాలు లేకపోవడంతో రైతుల్లో ఆందోళన పెరుగుతోంది. ఇప్పటికే వర్షాల కోసం ఎదురు చూస్తున్న అన్నదాతలకు ఎల్‌నినో ప్రభావం మరింత ఆందోళన కలిగిస్తోంది. పసిఫిక్ మహాసముద్రంలో ఎల్‌నినో పరిస్థితులు బలపడుతున్నట్లు అమెరికా జాతీయ సముద్ర, వాతావరణ సంస్థ (ఎన్ ఓ ఏఏ) ఆగస్టు 13న వెల్లడించింది. 2026 చివరి వరకు ఈ పరిస్థితి కొనసాగి మరింత బలపడే అవకాశాలున్నాయని పేర్కొంది. రాయలసీమలో వర్షపాతం పంపిణీ సాధారణంగా అస్థిరంగా ఉండే పరిస్థితికి తోడు ఈ ఏడాది వర్షాల కొరత రైతులను తీవ్రంగా ప్రభావితం చేస్తోంది. ముఖ్యంగా శ్రీ సత్యసాయి జిల్లాలో వ్యవసాయం ప్రధానంగా వర్షాధారంగా ఉండటంతో వర్షాల ఆలస్యం నేరుగా పంటలపై ప్రభావం చూపుతోంది.

వేరుశనగకు వర్షాభావ దెబ్బ…

జిల్లాలో ప్రధాన ఖరీఫ్ పంటగా ఉన్న వేరుశనగ సాగుపై వర్షాభావం తీవ్ర ప్రభావం చూపుతోంది. విత్తనాలు వేసిన ప్రాంతాల్లో తగినంత నేల తేమ లేక మొలక, ప్రారంభ ఎదుగుదల దశలోనే పంట దెబ్బతినే ప్రమాదం ఉంది. మరికొన్ని ప్రాంతాల్లో వర్షాల కోసం ఎదురుచూస్తూ రైతులు విత్తనాలు వేయడాన్ని ఆలస్యం చేస్తున్నారు. కదిరి, ధర్మవరం, హిందూపురం, మడకశిర, పెనుకొండ, సోమందేపల్లి తదితర ప్రాంతాల్లో వర్షాలపై ఆధారపడిన రైతుల పరిస్థితి ఆందోళనకరంగా మారుతోంది. ఇప్పటికే సాగు చేసిన పంటకు కీలక దశలో వర్షం అందకపోతే పెట్టుబడులు వృథా అయ్యే ప్రమాదం ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

బోర్లు ఉన్నా.. నీరు లేని పరిస్థితి…

వర్షాభావ ప్రభావం కేవలం పంటలకే పరిమితం కాకుండా భూగర్భ జలాలపైనా పడుతోంది. చెరువులు, కుంటలు, చెక్‌డ్యామ్‌లకు ఆశించిన స్థాయిలో నీరు చేరకపోవడంతో భూగర్భ జలాల రీచార్జ్ కూడా మందగించే పరిస్థితి ఏర్పడింది. దీంతో వ్యవసాయ బోర్లపై ఆధారపడే రైతులకు ఇబ్బందులు పెరుగుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో బోర్లలో నీటి మట్టం తగ్గడంతో వ్యవసాయానికి అదనపు నీటిని అందించే పరిస్థితి లేకుండా పోతోంది.

తాగునీటిపైనా ముందస్తు అప్రమత్తత అవసరం…

వర్షాభావం ఇలాగే కొనసాగితే రానున్న నెలల్లో గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సమస్య మరింత తీవ్రమయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం ఉన్న నీటి వనరులను కాపాడుకోవడంతో పాటు పనిచేయని బోర్లు, పైప్‌లైన్లు, నీటి సరఫరా వ్యవస్థలను ముందుగానే పటిష్టం చేయాల్సిన అవసరం ఉంది. పశువుల పరిస్థితి కూడా ఆందోళన కలిగిస్తోంది. నీటి లభ్యత తగ్గడంతో పాటు పశుగ్రాసం కొరత ఏర్పడే అవకాశం ఉండటంతో పశుసంవర్ధక శాఖ కూడా ముందస్తు ప్రణాళికతో వ్యవహరించాల్సిన అవసరం ఉంది.

ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి…

వర్షాలు ఆలస్యమవుతున్న పరిస్థితుల్లో తక్కువ కాలంలో చేతికొచ్చే, తక్కువ నీటితో సాగు చేయగల ప్రత్యామ్నాయ పంటల వైపు రైతులను మళ్లించడం కీలకంగా మారింది. నేలలో తేమను సంరక్షించే పద్ధతులు, ప్రకృతి వ్యవసాయం, పంటల వైవిధ్యీకరణ, తక్కువ నీటి వినియోగం వంటి అంశాలపై రైతులకు క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే జిల్లా యంత్రాంగం వర్షాభావ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని వ్యవసాయం, తాగునీరు, పశుగ్రాసం తదితర అంశాలపై ముందస్తు చర్యలకు ప్రాధాన్యం ఇస్తోంది.

రైతులకు భరోసా ఎక్కడ?

పంటలు దెబ్బతింటే రైతులపై పెట్టుబడి భారం మరింత పెరగనుంది. విత్తనాలు, ఎరువులు, దుక్కులు, కూలీల ఖర్చులు పెట్టి పంట చేతికందకపోతే రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంది. దీంతో వర్షాభావ ప్రభావిత ప్రాంతాల్లో పంటల పరిస్థితిపై ప్రభుత్వం సమగ్ర క్షేత్రస్థాయి సర్వే నిర్వహించాలని రైతులు కోరుతున్నారు. పంట నష్టాన్ని అంచనా వేసి అర్హులైన రైతులకు పంటల బీమా, నష్టపరిహారం, ప్రత్యామ్నాయ సాగుకు అవసరమైన విత్తనాలు, ఉపాధి అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు.

ఇప్పుడే చర్యలు.. రేపటి సంక్షోభానికి అడ్డుకట్ట…

ఎల్‌నినో ప్రభావం కొనసాగుతుందనే వాతావరణ హెచ్చరికల నేపథ్యంలో శ్రీ సత్యసాయి జిల్లాలో పరిస్థితిని కేవలం ప్రస్తుత ఖరీఫ్ సమస్యగా కాకుండా వ్యవసాయం–తాగునీరు–పశుగ్రాసం–ఉపాధి అనే నాలుగు అంశాలతో కూడిన సమగ్ర సంక్షోభంగా చూడాల్సిన అవసరం ఉంది. వర్షాలు కురిస్తే పరిస్థితి మారే అవకాశం ఉన్నప్పటికీ, అప్పటి వరకు రైతులు నష్టపోకుండా ముందస్తు ప్రణాళికలు అమలు చేయడం అత్యవసరం. వర్షపు ప్రతి చుక్కను ఒడిసిపట్టేలా చెరువులు, కుంటలు, చెక్‌డ్యామ్‌ల పునరుద్ధరణ, భూగర్భ జలాల సంరక్షణ, ప్రత్యామ్నాయ పంటల ప్రోత్సాహం, తాగునీటి భద్రతపై ప్రత్యేక కార్యాచరణ చేపడితేనే వర్షాభావ ప్రభావాన్ని కొంతవరకు తగ్గించే అవకాశం ఉంటుంది. వాన కోసం ఆకాశం వైపు చూస్తున్న రైతన్నకు ఇప్పుడు ప్రభుత్వ భరోసా, ముందస్తు కార్యాచరణే ప్రధాన ఆశ అనేది వాస్తవం.