దివిసీమకు అదనపు సాగునీరు విడుదల
అవనిగడ్డ, ఆంధ్రప్రభ : దివిసీమ రైతుల సాగునీటి సమస్యను అవనిగడ్డ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్‌చార్జ్ విక్కుర్తి శ్రీనివాసరావు జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన మంత్రి అధికారులను ఆదేశించడంతో పంట కాల్వలకు అదనపు నీటిని విడుదల చేశారు. విక్కుర్తి శ్రీనివాసరావు సీఈ, ఎస్‌ఈ, ఈఈలతో ఫోన్ ద్వారా మాట్లాడి అవనిగడ్డ, నాగాయలంక, కోడూరు పంట కాల్వలకు అదనపు నీటిని విడుదల చేయాలని కోరారు. దీంతో ఆదివారం కాల్వల్లో నీటి ప్రవాహం పెరిగింది. సాగునీటి సమస్య పరిష్కారానికి చొరవ చూపిన విక్కుర్తి శ్రీనివాసరావుకు కోడూరు డీసీ ఉపాధ్యక్షుడు బచ్చు రఘునాథ ప్రసాద్, నీటి సంఘాల అధ్యక్షులు దాసినేని శ్రీనివాసరావు, అప్పికట్ల రవీంద్ర ధన్యవాదాలు తెలిపారు.
