WGL | గంజాయి ముఠా గుట్టు రట్టు… 11కిలోల 210 గ్రాములు పట్టివేత

ఆంధ్రప్రభ ప్రతినిధి, భూపాలపల్లి : జయశంకర్ జిల్లాలో నిషేధిత ఎండు గంజాయి రవాణా చేస్తున్న ముఠా గుట్టు రట్టు చేశారు గణపురం పోలీసులు. భూపాలపల్లి సబ్ డివిజన్ పోలీసు కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో భూపాలపల్లి డీఎస్పీ సంపత్ రావు కేసుకు సంబంధించి వివరాలు వెల్లడించారు. డీఎస్పీ మాట్లాడుతూ… మంగళవారం సాయంత్రం గంజాయి రవాణా గురించి విశ్వసనీయ సమాచారం మేరకు డీఎస్పీ ఆదేశాలతో చిట్యాల సి‌ఐ మల్లేశ్ పర్యవేక్షణలో ఎస్‌ఐ అశోక్ తన సిబ్బందితో కలిసి రవినగర్ గ్రామ శివారులో గల మంగలోని కుంట మత్తడి వద్ద మాటు వేసి ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు.

గుర్రంపేటకు చెందిన ఆరెల్లి అఖిల్, చెల్పూర్ కు చెందిన ఆముదాల కార్తీక్, వరంగల్ జిల్లా వరికోల్ కు చెందిన ముస్కే రోహిత్ ల వద్ద రూ. 5,60, 500 (1 కేజీ 50,000) విలువ గల 11 కిలోల 210 గ్రాముల నిషేదింపబడిన ఎండు గంజాయి ఒక సంచిలో పట్టుకొని ఉండగా, వెంటనే వారిని అదుపులోకి తీసుకొని విచారణ చేశామని తెలిపారు. వీరు సంపాదించే డబ్బులు జల్సాలకు సరిపోకపోవడంతో గత కొద్ది రోజులుగా అక్రమంగా ఒరిస్సా రాష్ట్రంలోని కొండ ప్రాంతాల్లో గుర్తు తెలియని వ్యక్తుల దగ్గర తక్కువ ధరకు తెచ్చి భూపాలపల్లి, ఘనపురం మండల్ పరిసర ప్రాంతాల్లో అమ్ముతున్నారని తెలిపారు. గంజాయి పట్టుకోవడంలో ఉత్తమ విధులు నిర్వహించిన చిట్యాల సి‌ఐ మల్లేశ్, సి‌సి‌ఎస్ సి‌ఐ వెంకటేశ్వర్లు, ఘనపురం (ము) ఎస్‌ఐ అశోక్, సి‌సి‌ఎస్ ఎస్‌ఐ భాస్కర్ రావు, సిబ్బంది పీసీలు జే.శ్రీనివాస్, ఏ.అశోక్, పి.క్రాంతి, పి.నేతాజీ లను భూపాలపల్లి డి‌ఎస్‌పి, సంపత్ రావు ప్రత్యేకంగా అభినందించారు.

Leave a Reply