Telangana Politics | బీజేపీ భవిష్యత్తుపై విశ్లేషణ

Telangana Politics | బీజేపీ భవిష్యత్తుపై విశ్లేషణ
Telangana Politics | పశ్చిమ బెంగాల్ విజయంతో బీజేపీకి కొత్త ఉత్సాహం
తెలంగాణాలో బీజేపీ ఎదుగుదల నుంచి పతనం వరకు
బండి సంజయ్ తొలగింపు పార్టీకి నష్టమైందా?
బీజేపీపై లోపాయికారీ ఒప్పందాల ప్రచారం ప్రభావం
తెలంగాణాలో కాషాయ జెండా ఎగరవేయాలంటే ఏమి చేయాలి?
Telangana Politics | ఇటీవల జరిగిన అయిదు రాష్ట్రాల శాసనసభ సాధారణ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ మూడు రాష్ట్రాలలో విజయకేతనం ఎగురవేయడం విశేషం. అందులో ముఖ్యంగా 206 స్థానాలతో పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో బీజేపీ ఘన విజయం సాధించడం కచ్చితంగా చారిత్రాత్మక పరిణామం. బీజేపీ ఆవిర్భావానికి మూలమైన జనసంఘ్ వ్యవస్థాపకులు శ్యాంప్రసాద్ ముఖర్జీ పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో జన్మించారు. 1951లో జనసంఘ్ ఆవిర్భవించిన సుమారు ఏడున్నర దశాబ్దాల తరువాత అదే పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీని మోదీ, అమిత్ షాలు అధికారంలోకి తీసుకురావడం గొప్ప పరిణామం. ఈ పరిణామం కచ్చితంగా బీజేపీ సిద్ధాంతకర్త శ్యాంప్రసాద్ ముఖర్జీకి నిజమైన నివాళిగా భావించవచ్చు. దేశమంతా కాషాయమయం చేయాలనే మోదీ, అమిత్ షా సంకల్పానికి ఈ ఎన్నికల ఫలితాలు అత్యధిక బలాన్ని ఇచ్చాయనడంలో ఎటువంటి సందేహం లేదు.
మోదీ, అమిత్ షాలు తదుపరి 2028లో జరగబోయే ఎన్నికల్లో తెలంగాణా రాష్ట్రంపై కాషాయ జెండా ఎగురవేసేందుకు నడుంబిగుస్తున్నట్లు ఇప్పటికే ప్రచారం మొదలైంది. వాస్తవంగా 2023 ఎన్నికల ముందు ఒక దశలో తెలంగాణాలో బీజేపీ అధికారంలోకి కచ్చితంగా వస్తుందని అన్ని వర్గాలు భావించాయి. 2020 డిసెంబర్‌లో జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ 48 వార్డులలో విజయం సాధించి దాదాపు అధికారానికి చేరువ కావడమే దానికి నిదర్శనం. అప్పట్లో తెలంగాణాలో అధికారంలోకి రావడం ఖాయం అనేంత స్థాయిలో ఉవ్వెత్తున ఎగిసిపడిన బీజేపీ, 2023 ఎన్నికలు సమీపించిన కొద్దీ తుస్ అంటూ అధఃపాతాళానికి పడిపోయింది.
రాష్ట్ర బీజేపీ నాయకుల మధ్య ఉన్న అంతర్గత కలహాలుతో పాటు బీజేపీ జాతీయ నాయకత్వం తీసుకున్న అనాలోచిత నిర్ణయాలు కూడా తెలంగాణా బీజేపీ పతనానికి ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి. బీజేపీ జాతీయ నాయకత్వం అప్పట్లో తీసుకున్న రాష్ట్ర నాయకత్వ మార్పు నిర్ణయం కూడా తెలంగాణాలో బీజేపీకి తీవ్ర నష్టం కలిగించింది అనడంలో ఎటువంటి సందేహం లేదు. అప్పటి వరకు స్తబ్ధుగా ఉన్న బీజేపీకి 2020 మార్చి 11న బండి సంజయ్ కుమార్ రాష్ట్ర అధ్యక్షునిగా బాధ్యతలు చేపట్టారు. ఆనాటి నుంచి రాష్ట్ర అధ్యక్షునిగా బండి సంజయ్ అమలు చేసిన ప్రజా సంగ్రామ యాత్రలు, వ్యూహాత్మక చర్యలు, ప్రసంగాల కారణంగా మారుమూల గ్రామాల నుంచి పట్టణ, నగర స్థాయిల వరకు బీజేపీ విస్తృతంగా బలపడింది.
ఆ సమయంలో యువత, మహిళలు, తటస్థులను బీజేపీ విపరీతంగా ఆకర్షించింది. అప్పట్లో రాష్ట్రంలోని నాయకుల మధ్య చిన్న చిన్న కలహాలు ఉన్నా అవన్నీ పార్టీ ఎదుగుదలకు ఎటువంటి అడ్డంకిగా కనిపించలేదు. అయినా రాష్ట్ర నాయకుల మధ్య ఉన్న అంతర్గత కలహాలు తొలగించేందుకు ఎటువంటి చర్యలూ తీసుకోకుండా 2023 ఎన్నికలకు ముందు రాష్ట్ర అధ్యక్షునిగా బండి సంజయ్‌ను తొలగించి బీజేపీ అధిష్టానం సెల్ఫ్ గోల్ వేసుకుంది. ఆ సమయంలో రాష్ట్రంలో బీజేపీ బలాన్ని, ఎదుగుదలను అంచనా వేయడంలో బీజేపీ జాతీయ నాయకత్వం ఘోరంగా వైఫల్యం చెందినట్లు స్పష్టంగా తెలుస్తోంది.
బీజేపీ అధిష్టానం తీసుకున్న రాష్ట్ర నాయకత్వ మార్పు నిర్ణయంతో తెలంగాణా రాష్ట్రంలో బీజేపీపై అప్పటి వరకు పెల్లుబికిన విశ్వసనీయత మొత్తం సన్నగిల్లింది. అదే సమయంలో బీఆర్ఎస్ పార్టీతో బీజేపీ ఢిల్లీ పెద్దలు లోపాయికారీ ఒప్పందం చేసుకున్నారు అనే వార్తలు అప్పట్లో ప్రజలలోకి బలంగా వెళ్లాయి. బీఆర్ఎస్‌పై దూకుడుగా ఉన్నారనే కేసీఆర్ కోరికపై బండి సంజయ్‌ను రాష్ట్ర అధ్యక్షునిగా తొలగించారనే వార్తలు కూడా ప్రజలలో షికారు చేశాయి.
అదేవిధంగా ఆ సమయంలో ఎన్నికల కోడ్ ఉండగానే బీఆర్ఎస్ తాత్కాలిక ప్రభుత్వానికి రైతుబంధు నిధులు విడుదల చేసేందుకు ఎన్నికల సంఘం అనుమతి ఇచ్చింది. బీజేపీ ఢిల్లీ పెద్దల మద్దతుతోనే రైతుబంధు నిధులు ఇచ్చేందుకు కేసీఆర్ తాత్కాలిక ప్రభుత్వానికి అనుమతి వచ్చింది అనే భావన కూడా ప్రజలలో తలెత్తింది. బీజేపీ జాతీయ నాయకత్వం అనుసరించిన ఇటువంటి అనాలోచిత వైఖరితో 2023 ఎన్నికల్లో తెలంగాణాలో అధికారంలోకి వస్తుంది అనుకున్న భారతీయ జనతా పార్టీ కేవలం సింగిల్ డిజిట్‌కే పరిమితమైంది.
తెలంగాణా రాష్ట్ర బీజేపీలో అత్యంత అనుభవమైన, శక్తివంతమైన నాయకులు అనేక మంది ఉన్నారు. కానీ వారందరినీ కలుపుకుని పోయి కార్యకర్తలను, నాయకులను తద్వారా పార్టీని ఒకే తాటిపై నడిపే చరిష్మా కలిగిన శక్తివంతమైన నాయకత్వం రాష్ట్ర బీజేపీకి లేదు. తెలంగాణా రాష్ట్రంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు బలంగా ఉన్నాయి. వాటి ప్రభావాన్ని తట్టుకుని అధికారంలోకి వచ్చేందుకు ఢిల్లీ బీజేపీ పెద్దలతో పాటు రాష్ట్ర బీజేపీ నేతలు శక్తియుక్తులు ప్రదర్శించాల్సి ఉంది.
తెలంగాణా ఉద్యమాల పురిటిగడ్డ. తెలంగాణా ప్రజలలో ఉన్న చైతన్యం, విషయ పరిజ్ఞానం దేశంలో ఏ ఇతర రాష్ట్రంలో లేవు అనేది నిర్వివాదాంశం. కనుక స్థానిక అంశాలపై ఆచరణాత్మక హామీలుతోనే మోదీ, అమిత్ షాల ఆశయం తెలంగాణాలో నెరవేరే పరిస్థితి కనిపిస్తోంది.
- కైలసాని శివప్రసాద్
9440203999
