Public Transport India | ప్రజా రవాణా బలోపేతంతో ఇంధన ఆదా

Public Transport India | ప్రజా రవాణా బలోపేతంతో ఇంధన ఆదా
Public Transport India | పెట్రోల్, డీజిల్ వినియోగం తగ్గించాలని మోడీ పిలుపు
యూరోప్ దేశాల్లో పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ విజయగాథ
భారత్లో ప్రజా రవాణా అభివృద్ధికి ఇంకా దూరం
స్వంత వాహనాల బదులు ప్రజా రవాణాపై దృష్టి అవసరం
Public Transport India | పశ్చిమాసియా పరిణామాల నేపథ్యంలో హైదరాబాద్‌లో జరిగిన ఒక బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోడీ ఒక విలువైన సూచన చేశారు. పెట్రోల్, డీజిల్ వినియోగాన్ని తగ్గించుకోవాలని దేశ ప్రజలకు ఆయన పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా ప్రజా రవాణాకు ప్రాధాన్యం ఇవ్వాలని ఆయన హితవు పలికారు. ఆధునిక సమాజంలో ప్రజా రవాణా వ్యవస్థకు ఎనలేని ప్రాధాన్యం ఉంది. ఇటీవలి కాలంలో ఈ ప్రాధాన్యం మరింతగా పెరిగింది. దీనికి కారణం ప్రపంచ వ్యాప్తంగా ఇంధన వనరులు తగ్గిపోవడం.
ఇప్పటికైతే, మన దేశంలో పెట్రోల్, డీజిల్ నిల్వలకు వచ్చిన ఇబ్బంది ఏమీలేదు. అయితే, రోజురోజుకూ మార్కెట్లో కార్ల విక్రయాలు జోరందుకుంటున్నాయి. ఒక వైపు కొత్త కొత్త కార్లు రోడ్లపై పరుగులు తీస్తుంటే, మరో వైపు పెట్రోల్, డీజిల్ వినియోగం కూడా పెరుగుతోంది. ఇదిలాగే కొనసాగితే, ఏదో ఒకరోజు పెట్రోల్, డీజిల్‌కు తీవ్ర కొరత ఏర్పడక తప్పదు. అయితే ఇందుకు చెక్ పెట్టడానికి అందుబాటులో ఉన్న ఏకైక అస్త్రం ప్రజా రవాణా వ్యవస్థను ప్రోత్సహించడమే.

సమర్థవంతమైన ప్రజా రవాణా వ్యవస్థ ద్వారా పెట్రోల్, డీజిల్ భారీ ఎత్తున ఆదా చేయవచ్చు. అంతేకాదు ప్రజా రవాణా వ్యవస్థ ఎంతగా బలోపేతం అయితే, నగరాలు, పట్టణాల్లో కూడళ్ల దగ్గర రద్దీ అంతగా తగ్గుతుంది. ప్రజలు చిన్న చిన్న అవసరాలకు కార్లు బయటకు తీయాల్సిన అవసరం ఉండదు. అంతేకాదు ప్రజలు తమ గమ్యాన్ని చేరుకోవడం కూడా సులభమవుతుంది. ప్రజా రవాణా వ్యవస్థను బలోపేతం చేయాలంటే ముందుగా సబ్‌వేలు, మెట్రో సర్వీసులు, ఎంఎంటీఎస్‌ల వంటి వాటిపై ప్రభుత్వాలు ప్రత్యేక దృష్టి పెట్టాల్సి ఉంటుంది.
యూరోప్ దేశాల్లో పటిష్టంగా పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్
అనేక యూరోప్ దేశాల్లో ప్రజా రవాణా వ్యవస్థ ఇటీవలి కాలంలో బలోపేతమైంది. ఇక్కడ ప్రధానంగా లక్సెంబర్గ్ దేశం గురించి ప్రస్తావించుకోవాలి. దాదాపు ఐదు సంవత్సరాల కిందట ప్రజా రవాణా వ్యవస్థను బలోపేతం చేయాలని లక్సెంబర్గ్ గట్టి నిర్ణయం తీసుకుంది. ఒక దశలో ప్రైవేటు కార్ల వాడకాన్ని తగ్గించాలని దేశ పౌరులకు లక్సెంబర్గ్ అధికార యంత్రాంగం పిలుపునిచ్చింది. ఈ పిలుపునకు ప్రజల నుంచి అనూహ్య స్పందన వచ్చింది. దీంతో ప్రజా రవాణా వ్యవస్థ వినియోగంలో లక్సెంబర్గ్ అద్భుతమైన విజయం సాధించింది.
ఇందులో భాగంగా కొత్త బస్సు రూట్లు, మెట్రో రైళ్లు, సబ్‌వేలను ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చింది అధికార యంత్రాంగం. దీంతో చుట్టుపక్కల ప్రాంతాలకే కాదు, కొన్ని వందల మైళ్ల దూరాన ఉన్న నగరాలకు వెళ్లడానికి కూడా ప్రజా రవాణా వ్యవస్థను ఉపయోగించడం మొదలెట్టారు ప్రజలు. అంతేకాదు దేశవ్యాప్తంగా పర్యాటక రంగం అభివృద్ధిలో కూడా ప్రజా రవాణా వ్యవస్థ కీలకంగా మారింది. పర్యాటక రంగం అభివృద్ధి చెందడంతో ఆయా దేశాలు పెద్ద ఎత్తున విదేశీ మారక ద్రవ్యం ఆర్జించే అవకాశాలు కూడా పెరిగాయి.
లక్సెంబర్గ్ ఒక్కటే కాదు… నెదర్లాండ్స్, నార్వే సహా అనేక ఇతర యూరోపియన్ దేశాలు కూడా ప్రజా రవాణా వ్యవస్థకు పెద్ద పీట వేస్తున్నాయి. కాగా యూరప్‌తో పోలిస్తే, భారత్లో ప్రజా రవాణా వ్యవస్థ అనుకున్న స్థాయిలో అభివృద్ధి జరగలేదు. పెద్ద పెద్ద నగరాలు, పట్టణాల్లోనే ఇప్పటికీ మెట్రో రైళ్లు వచ్చాయి. అది కూడా కొన్ని రాష్ట్రాల్లోని ఎంపిక చేసిన నగరాలు, పట్టణాల్లోనే మెట్రో రైళ్లు నడుస్తున్నాయి. మొత్తంగా భారత్లో ప్రజా రవాణా వ్యవస్థ అనుకున్న రీతిలో అభివృద్ధి జరగలేదన్నది వాస్తవం.
అంతేకాదు లోకల్ రైళ్ల వ్యవస్థ కూడా అనేక నగరాలకు అందుబాటులోకి రాలేదు. ప్రజా రవాణా వ్యవస్థను బలోపేతం చేయాలంటే ముందుగా రహదారులను మెరుగుపరచాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరిన్ని స్వర్ణచతుర్భుజి వంటి ప్రాజెక్టులను అభివృద్ధి చేయాలి. జాతీయ రహదారుల అభివృద్ధిపై ప్రభుత్వాలు ప్రత్యేక దృష్టి పెట్టాలి. స్వంత కార్లను పక్కన పెట్టి, గమ్యస్థానాలు చేరడానికి ప్రజా రవాణా వ్యవస్థను ఉపయోగించుకునే ఆలోచనా ధోరణిని ప్రజలు అలవరచుకోవాలి.
ఎస్. అబ్దుల్ ఖాలిక్
6300174320
