వాడపల్లి పుణ్యక్షేత్రానికి ఏపీటీడీసీ ‘ఒకరోజు యాత్ర’

విజయవాడ–వాడపల్లి–విజయవాడ ప్యాకేజీ ప్రారంభం..
ప్రతి శనివారం ప్రత్యేక బస్సు
పెద్దలకు రూ.1,160.. పిల్లలకు రూ.1,000..
అల్పాహారం, మధ్యాహ్న భోజనం సదుపాయం


(విజయవాడ, ఆంధ్రప్రభ) : భక్తులు, పర్యాటకులకు సౌకర్యవంతమైన తీర్థయాత్రను అందించేందుకు ఆంధ్రప్రదేశ్ పర్యాటక అభివృద్ధి సంస్థ (ఏపీటీడీసీ) విజయవాడ,వాడపల్లి,విజయవాడ ఒకరోజు పర్యాటక ప్యాకేజీని ప్రారంభించింది. శనివారం ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్ ఎదురుగా ఉన్న సెంట్రల్ రిజర్వేషన్ కార్యాలయం వద్ద ఏపీటీడీసీ జనరల్ మేనేజర్ టి.ఎస్.వి.నారాయణ జెండా ఊపి ప్రత్యేక బస్సు సర్వీసును లాంఛనంగా ప్రారంభించారు.

భక్తులు, పర్యాటకులకు ఆధునిక సౌకర్యాలతో కూడిన రవాణా, ఆహార వసతులు కల్పిస్తూ ప్రణాళికాబద్ధమైన తీర్థయాత్ర అనుభవాన్ని అందించాలనే ఉద్దేశంతో ఈ ప్యాకేజీని రూపొందించినట్లు టి.ఎస్.వి.నారాయణ తెలిపారు. ప్రతి శనివారం ఉదయం 4 గంటలకు విజయవాడ నుంచి యాత్ర ప్రారంభమై, వాడపల్లి పుణ్యక్షేత్రాన్ని సందర్శించిన అనంతరం అదే రోజు రాత్రి 7 గంటలకు తిరిగి విజయవాడ చేరుకునేలా యాత్రను రూపొందించినట్లు వివరించారు.

ఈ ఒకరోజు యాత్ర ప్యాకేజీకి పెద్దలకు రూ.1,160, పిల్లలకు రూ.1,000 చొప్పున ధర నిర్ణయించినట్లు తెలిపారు. ప్యాకేజీ రుసుములో సౌకర్యవంతమైన బస్సు రవాణాతో పాటు ఉదయం అల్పాహారం, మధ్యాహ్న భోజనం కూడా అందిస్తామని చెప్పారు. అయితే ఆలయ దర్శనానికి సంబంధించిన టికెట్ ఛార్జీలను పర్యాటకులు, భక్తులే స్వయంగా చెల్లించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. వాడపల్లి ప్రత్యేక యాత్రను సద్వినియోగం చేసుకోవాలనుకునే భక్తులు, పర్యాటకులు ముందుగానే తమ సీట్లను బుక్ చేసుకోవాలని ఏపీటీడీసీ జనరల్ మేనేజర్ సూచించారు. ఆన్‌లైన్‌లో ఏపీటీడీసీ అధికారిక వెబ్‌సైట్ ద్వారా బుకింగ్ చేసుకోవచ్చని, లేదా విజయవాడ బందర్ రోడ్డులో లెమన్ ట్రీ హోటల్ పక్కన ఉన్న సెంట్రల్ రిజర్వేషన్ కార్యాలయంలో నేరుగా సంప్రదించి సీట్లు రిజర్వ్ చేసుకోవచ్చని తెలిపారు. భక్తులకు సౌకర్యవంతమైన, సమయపాలనతో కూడిన ఒకరోజు తీర్థయాత్రను అందించడమే ఈ ప్యాకేజీ ప్రధాన ఉద్దేశమని ఆయన పేర్కొన్నారు.