భానుడి భగభగ… ఆర్టీసీ ప్రయాణికుల విలవిల

గుంటూరు ప్రతినిధి/ ఆంధ్రప్రభ : ఉమ్మడి గుంటూరు జిల్లాలో మండిపోతున్న ఎండలు ఆర్టీసీ ప్రయాణికులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లాల్లో 44 నుంచి 47 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో బస్సు ప్రయాణం భారంగా మారింది. మూడు జిల్లాల పరిధిలోని 12 డిపోల నుంచి సుమారు 900 బస్సులు నిత్యం మూడు లక్షల మందికి సేవలందిస్తున్నా, ప్రయాణికులకు కనీస ఉపశమన చర్యలు కనిపించడం లేదని ఆవేదన వ్యక్తమవుతోంది.

దూర ప్రయాణాలకు ప్రయాణికుల భయం

మాచర్ల, నరసరావుపేట, చీరాల, రేపల్లె, బాపట్ల, తెనాలి ప్రాంతాల నుంచి ప్రజలు రోజూ 120 నుంచి 180 కిలోమీటర్ల దూరం ప్రయాణించాల్సి వస్తోంది. మండే ఎండల్లో బస్సుల్లోకి వచ్చే వేడిగాలులతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వడదెబ్బ భయంతో తలకు కండువాలు కట్టుకుని, చేతులతో ముఖాన్ని కప్పుకుని ప్రయాణిస్తున్నారు.

పల్లె వెలుగు బస్సుల్లో ఉక్కపోత

గ్రామీణ ప్రాంతాల్లో నడిచే పల్లె వెలుగు బస్సుల పరిస్థితి మరింత దారుణంగా మారింది. ఉమ్మడి జిల్లాలో నడిచే బస్సుల్లో దాదాపు 65 శాతం పల్లె వెలుగు బస్సులే ఉన్నాయి. చాలా బస్సుల్లో తలుపులు సరిగా లేకపోవడం, కిటికీ అద్దాలు పనిచేయకపోవడంతో వేడిగాలులు నేరుగా లోపలికి వస్తున్నాయి. దీంతో ప్రయాణికులు తల తిరగడం, దప్పిక, అలసట వంటి సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు.

బస్సు స్టాపుల్లో ఎండలోనే నిరీక్షణ

పల్లె వెలుగు బస్సులకు స్టాపులు ఎక్కువగా ఉండటంతో ప్రయాణికులు ఎండలోనే గంటల తరబడి బస్సుల కోసం ఎదురుచూడాల్సి వస్తోంది. ముఖ్యంగా పల్నాడు ప్రాంతంలో తీవ్ర ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో వడదెబ్బలు పెరిగే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తమవుతోంది. మరో వారం రోజులు ఎండల తీవ్రత కొనసాగుతుందన్న హెచ్చరికలతో ప్రయాణికుల్లో భయం నెలకొంది.

కనిపించని తాగునీటి సదుపాయం

గతంలో వేసవికాలంలో ఆర్టీసీ బస్సుల్లో స్వచ్ఛంద సంస్థలు కూలింగ్ వాటర్ క్యాన్లు ఏర్పాటు చేసేవి. ఈసారి చాలా డిపోలలో అలాంటి సదుపాయం కనిపించడం లేదు. డ్రైవర్లు, కండక్టర్లు స్వయంగా నీరు తెచ్చుకుంటుండగా, ప్రయాణికులు తీసుకువచ్చిన నీరు కూడా కొద్దిసేపటికే వేడెక్కిపోతోంది. బస్టాండ్లలో చల్లని నీటికి అధిక ధరలు వసూలు చేస్తున్నారని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వేసవి ముగిసే వరకు బస్సుల్లో తాగునీటి సదుపాయం కల్పించాలని ప్రజలు కోరుతున్నారు.

Leave a Reply