బడి పిలుపుతో విద్యా చైతన్యం

బడి పిలుపుతో విద్యా చైతన్యం

విజయవాడ ఈస్ట్‌లో విద్యారథానికి విశేష స్పందన
విద్యార్థులు–తల్లిదండ్రుల్లో చదువుపై అవగాహన
‘ప్రతి చిన్నారి బడిలోకి’ లక్ష్యంతో ముందుకు విద్యాశాఖ
నమోదు పెంపు, డ్రాప్‌అవుట్‌ల నివారణపై ప్రత్యేక దృష్టి

విజయవాడ, ఆంధ్రప్రభ : అక్షరాస్యతకు మరింత బలం చేకూర్చుతూ, ప్రతి చిన్నారి విద్య హక్కును కుటుంబాల గడపదాకా తీసుకెళ్లాలన్న లక్ష్యంతో నిర్వహిస్తున్న “బడి పిలుస్తుంది” కార్యక్రమం ఎన్టీఆర్ జిల్లాలో విశేష స్పందన పొందుతోంది. బుధవారం విజయవాడ ఈస్ట్ నియోజకవర్గ పరిధిలో సాగిన చైతన్య విద్యారథం విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. విద్యపై సామాజిక బాధ్యతను గుర్తుచేస్తూ సాగిన ఈ కార్యక్రమం ప్రజల్లో చైతన్యాన్ని రగిలించింది.

బుధవారం జరిగిన ఈ అవగాహన ర్యాలీలో జిల్లా విద్యాశాఖాధికారి ఎల్. చంద్రకళ, ఏపీసీ ఆర్. రమేష్‌బాబు పాల్గొని విద్య ప్రాధాన్యాన్ని వివరించారు. ఒక్క చిన్నారి కూడా చదువుకు దూరం కాకూడదన్నదే ప్రభుత్వ లక్ష్యమని, విద్యే భవిష్యత్తుకు బలమైన పునాది అని వారు స్పష్టం చేశారు. ఇంటింటికీ వెళ్లి తల్లిదండ్రులతో మాట్లాడిన అధికారులు ప్రభుత్వ పాఠశాలల్లో అందుతున్న నాణ్యమైన విద్య, డిజిటల్ బోధన, ఉచిత పాఠ్యపుస్తకాలు, యూనిఫాంలు, మధ్యాహ్న భోజనం, మౌలిక సదుపాయాల గురించి వివరించారు. చదువు మధ్యలో మానేసిన పిల్లలను తిరిగి బడిలో చేర్పించడం, కొత్తగా స్కూల్‌కి వచ్చే పిల్లల నమోదు పెంచడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశ్యంగా పేర్కొన్నారు.

రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో నమోదు శాతం పెంపు, డ్రాప్‌అవుట్‌ల తగ్గింపు, ఫౌండేషన్ లెర్నింగ్ బలోపేతం కోసం విద్యాశాఖ పలు కార్యక్రమాలు అమలు చేస్తోందని విద్యా వర్గాలు చెబుతున్నాయి. ఈ క్రమంలో గ్రామాలు, పట్టణాల్లో నిర్వహిస్తున్న ‘బడి పిలుస్తుంది’ కార్యక్రమం విద్యా సంస్కరణలకు సామాజిక మద్దతు తీసుకురావడంలో కీలకంగా మారింది. కార్యక్రమంలో సమగ్ర శిక్ష అధికారులు, ఎంఈఓలు, సీఆర్పీలు, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొని విజయవంతం చేశారు. “ప్రతి చిన్నారి బడిలోకి… ప్రతి కుటుంబంలో విద్యా చైతన్యం” అనే నినాదం విజయవాడ వీధుల్లో మార్మోగి విద్యకు కొత్త దిశను చూపించింది.

Leave a Reply