కుటుంబ కలహాలతో ఆటో డ్రైవర్ అదృశ్యం..

ఘట్‌కేసర్, ఆంధ్రప్రభ : కుటుంబ గొడవల నేపథ్యంలో మనస్తాపానికి గురై ఒక వ్యక్తి అదృశ్యమైన ఘటన పోచారం ఐటీసీ పోలీస్ స్టేషన్ పరిధిలోని పోచారం గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం… పోచారం గ్రామానికి చెందిన వరికుప్పల రమేష్ (45) ఆటో డ్రైవర్‌గా జీవనం సాగిస్తున్నాడు. అతనికి 2004లో మహేశ్వరి (35)తో వివాహం కాగా, వీరికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. గురువారం రాత్రి భార్యాభర్తల మధ్య ఆర్థిక విషయాలపై గొడవ జరిగింది.

దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన రమేష్ ఇంటి నుండి బయటకు వెళ్ళిపోగా… అతని సోదరుడు శేఖర్ నచ్చజెప్పి తిరిగి ఇంటికి తీసుకువచ్చాడు. అయితే శుక్రవారం ఉదయం భార్య మహేశ్వరి మున్సిపాలిటీ విధులకు వెళ్ళిన తర్వాత, రమేష్ ఎవరికీ చెప్పకుండా ఇంటి నుండి బయటకు వెళ్ళిపోయాడు. తిరిగి ఇంటికి వచ్చిన భార్య, కుటుంబ సభ్యులు చుట్టుపక్కల ప్రాంతాల్లో, బంధువులు, స్నేహితుల వద్ద వెతికినా అతని ఆచూకీ లభించలేదు. బాధితురాలు మహేశ్వరి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు..

Leave a Reply