ఘటనాస్థలాన్ని పరిశీలించిన జాయింట్ కలెక్టర్
దక్షిణ ఎనర్జీ పరిశ్రమలో విషాదం
పరవాడ, ఆంధ్రప్రభ: అనకాపల్లి జిల్లా పరవాడలోని జవహర్లాల్ నెహ్రూ ఫార్మాసిటీకి ఆనుకుని ఉన్న ఇండస్ట్రియల్ పార్క్లో గల దక్షిణ ఎనర్జీ పరిశ్రమలో సోమవారం ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఇద్దరు కార్మికులు మృతి చెందగా, పరిశ్రమలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
మృతులను చోడవరం మండలం గోవాడ గ్రామానికి చెందిన వెంకటేష్, అచ్యుతాపురం ప్రాంతానికి చెందిన తిరునాద్గా గుర్తించినట్లు సమాచారం. ప్రమాదం జరిగిన సమయంలో పరిశ్రమలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో కార్మికుల్లో భయాందోళనలు నెలకొన్నాయి.
సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ప్రమాదానికి గల కారణాలపై అధికారులు విచారణ చేపట్టినట్లు తెలుస్తోంది.
ఈ ఘటనపై జాయింట్ కలెక్టర్ సూర్యమాన్ పటేల్ ఘటనాస్థలాన్ని సందర్శించి పరిస్థితిని సమీక్షించారు. సహాయక చర్యలు, ప్రమాదానికి దారితీసిన పరిస్థితులపై అధికారుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు.
అగ్నిప్రమాదానికి సంబంధించిన పూర్తి అధికారిక వివరాలు, నష్టపరిస్థితులపై నివేదిక ఇంకా వెలువడాల్సి ఉంది.
