తెలుగు రాష్ట్ర ప్రజలకు రైల్వే గుడ్ న్యూస్..

తెలుగు రాష్ట్ర ప్రజలకు రైల్వే గుడ్ న్యూస్..

-చర్లపల్లి–భువనేశ్వర్ మధ్య కొత్త వీక్లీ ఎక్స్‌ప్రెస్
-విజయవాడ మీదుగా ఒడిశాకు నేరుగా కొత్త రైలు సేవలు..
-మే 25 నుంచి పట్టాలెక్కనున్న ఎక్స్‌ప్రెస్
-నల్గొండ నుంచి రాజమండ్రి, విశాఖ మీదుగా భువనేశ్వర్‌కు సౌకర్యవంతమైన ప్రయాణం..

ఆంధ్రప్రభ, ఎన్టీఆర్ బ్యూరో:

తెలుగు రాష్ట్రాల ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త అందించింది. చర్లపల్లి–భువనేశ్వర్ న్యూ మధ్య కొత్త వారాంత ఎక్స్‌ప్రెస్ రైలు సేవలను ప్రారంభిస్తూ రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు ప్రత్యేక రైలుగా నడుస్తున్న సేవలను క్రమబద్ధీకరిస్తూ 17067,17068 నంబర్లతో రెగ్యులర్ వీక్లీ ఎక్స్‌ప్రెస్‌గా ప్రవేశపెట్టినట్లు విజయవాడ డివిజన్ ప్రకటించింది. రైల్వే మంత్రిత్వ శాఖ ఆమోదంతో ప్రారంభమవుతున్న ఈ రైలు సేవలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల మధ్య ప్రయాణించే వేలాది మంది ప్రయాణికులకు భారీ ఊరటనివ్వనున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్‌ పరిసర ప్రాంతాల నుంచి విజయవాడ, గోదావరి జిల్లాలు, ఉత్తరాంధ్ర మీదుగా భువనేశ్వర్‌కు వెళ్లే ప్రయాణికులకు ఈ రైలు కీలక అనుసంధానంగా మారనుంది.

రైలు వివరాలు ఇవే..

రైల్ నెంబర్ 17067 చర్లపల్లి – భువనేశ్వర్ న్యూ వీక్లీ ఎక్స్‌ప్రెస్ ప్రతి సోమవారం నడుస్తుంది. మే 25 నుంచి సేవలు ప్రారంభం కానున్నాయి. రైల్ నెంబర్ 17068 భువనేశ్వర్ న్యూ – చర్లపల్లి వీక్లీ ఎక్స్‌ప్రెస్
ప్రతి మంగళవారం నడుస్తుంది. మే 26 నుంచి అందుబాటులోకి రానుంది.

ప్రధాన స్టేషన్లు – సమయాలు..

కొత్త రైల్వే 17067 చర్లపల్లి–భువనేశ్వర్ రైలు సోమవారం సాయంత్రం 6.10 గంటలకు చర్లపల్లి నుంచి బయలుదేరి, నల్గొండ, మిర్యాలగూడ, గుంటూరు, విజయవాడ, కైకలూరు, ఆకివీడు, భీమవరం టౌన్, తణుకు, రాజమండ్రి, సామర్లకోట, అన్నవరం, అనకాపల్లి, దువ్వాడ, పెందుర్తి, కొత్తవలస, విజయనగరం, శ్రీకాకుళం రోడ్, పలాస, బ్రహ్మపురం, ఖుర్దా రోడ్ మీదుగా మంగళవారం సాయంత్రం 4.45 గంటలకు భువనేశ్వర్ న్యూ జంక్షన్‌కు చేరుకుంటుంది. అదేవిధంగా 17068 భువనేశ్వర్–చర్లపల్లి రైలు మంగళవారం రాత్రి 10.15 గంటలకు భువనేశ్వర్ న్యూ జంక్షన్ నుంచి బయలుదేరి అదే మార్గంలో ప్రయాణించి బుధవారం రాత్రి 9.50 గంటలకు చర్లపల్లికి చేరుతుంది. ఈ రైలులో 3 ఏసీ-2 టైర్ కోచ్‌లు, 5 ఏసీ-3 టైర్ కోచ్‌లు,10 స్లీపర్ కోచ్‌లు,4 జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లు ఉండనున్నట్లు రైల్వే శాఖ వెల్లడించింది.

విజయవాడకు మరింత రైల్వే ప్రాధాన్యం..

ఈ కొత్త రైలు సేవతో విజయవాడ జంక్షన్‌కు మరో కీలక కనెక్టివిటీ లభించనుంది. ఇప్పటికే దేశంలోని ప్రధాన నగరాలకు అనుసంధాన కేంద్రంగా ఉన్న విజయవాడకు, ఇప్పుడు ఒడిశా రాజధాని భువనేశ్వర్‌తో మరింత బలమైన రైల్వే లింక్ ఏర్పడుతోంది. గోదావరి, ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి ఒడిశా వెళ్లే ఉద్యోగులు, విద్యార్థులు, వ్యాపార వర్గాలకు ఈ రైలు పెద్ద ఉపశమనం కానుంది. ముఖ్యంగా వేసవి సీజన్, పండుగల సమయంలో ప్రయాణ రద్దీని తగ్గించడంలో ఈ కొత్త సర్వీస్ కీలక పాత్ర పోషించనుందని రైల్వే వర్గాలు భావిస్తున్నాయి.

Leave a Reply