నేటి నుండి జిల్లాలో ‘ఆపరేషన్ క్లీన్ స్వీప్’

నేటి నుండి జిల్లాలో ‘ఆపరేషన్ క్లీన్ స్వీప్’
-జిల్లా ఇంచార్జి కలెక్టర్ సంజన సింహ
-ముమ్మరంగా ప్రత్యేక పారిశుధ్య డ్రైవ్
-జూన్ 20 వరకు అన్ని పట్టణ, స్థానిక సంస్థల్లో ప్రత్యేక కార్యక్రమాలు
నరసరావుపేట,ఆంధ్రప్రభ:
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన “స్వర్ణాంధ్ర – స్వచ్ఛాంధ్ర” మహాయజ్ఞంలో భాగంగా జిల్లాలోని అన్ని పట్టణ, స్థానిక సంస్థల పరిధిలో మే 22 నుండి జూన్ 20, 2026 వరకు నాలుగు వారాల పాటు ముమ్మర పారిశుధ్య డ్రైవ్ “ఆపరేషన్ క్లీన్ స్వీప్” నిర్వహించనున్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో ఈ డ్రైవ్‌ను పకడ్బందీగా అమలు చేయనున్నట్లు జిల్లా ఇంచార్జి కలెక్టర్ సంజన సింహ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ‘స్వచ్ఛ సర్వేక్షన్ 2025-26’ ప్రమాణాల ఆధారంగా ఈ ప్రత్యేక డ్రైవ్‌ను నాలుగు వారాల పాటు నిర్దేశిత కార్యాచరణ ప్రణాళికతో నిర్వహిస్తున్నట్లు ఆమె వివరించారు.
నాలుగు వారాల కార్యాచరణ ప్రణాళిక:
మొదటి వారం (మే 22 – మే 28): గత స్వచ్ఛ సర్వేక్షన్‌లో గుర్తించిన రెడ్, ఎల్లో బ్లాక్ స్పాట్ల నిర్మూలన, ప్రధాన రహదారులు, జంక్షన్ల క్లీనింగ్, రోడ్ మార్కింగ్స్ మరియు కర్బ్ పెయింటింగ్స్ పనులు చేపడతారు.
రెండవ వారం (మే 29 – జూన్ 4): వర్షాకాలానికి ముందే పట్టణాల్లోని వరద కాలువలు, ప్రధాన నాలాల పూడికతీత పనులు మరియు ఇరుకైన సందులలో లోతైన శుభ్రత కార్యక్రమాలు నిర్వహిస్తారు.
మూడవ వారం (జూన్ 5 – జూన్ 11): నివాస, వాణిజ్య సముదాయాలలో 100% తడి-పొడి చెత్త వర్గీకరణను అమలు చేయడం, బల్క్ వేస్ట్ (భారీ వ్యర్థాల) ఉత్పత్తిదారులచే సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ నిబంధనలను కచ్చితంగా పాటించేలా చేయడం.
నాల్గవ వారం (జూన్ 12 – జూన్ 20): అన్ని పబ్లిక్, కమ్యూనిటీ టాయిలెట్ల సంపూర్ణ శానిటైజేషన్ మరియు చెత్త వేసే సమస్యాత్మక ప్రాంతాల పూర్తి నిర్మూలన.
కఠిన చర్యలు – పారదర్శకత:
సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ నిబంధనలను ఉల్లంఘించే హోటళ్లు, మార్కెట్లు, కల్యాణ మండపాలపై కఠిన చర్యలు ఉంటాయని ఇంచార్జి కలెక్టర్ హెచ్చరించారు. నిబంధనలు పాటించని పక్షంలో అవసరమైతే నీరు, విద్యుత్ సరఫరా నిలిపివేసే అధికారాలు కలెక్టర్లకు ఉన్నాయన్నారు. పనుల్లో పారదర్శకత కోసం ‘ジయోస్టాట్ టీమ్’ అనే థర్డ్-పార్టీ ఏజెన్సీ ద్వారా పనులకు ముందు, ఆ తర్వాత ఫోటోలను జియో-ట్యాగ్ చేసి రోజువారీ నివేదికలను పోర్టల్‌లో అప్‌లోడ్ చేస్తామన్నారు. మున్సిపల్ కమిషనర్లు వార్డుల వారీగా మైక్రో ప్లాన్స్ సిద్ధం చేసి, ప్రతి రోజు రాత్రి 8 గంటల లోపు వివరాలను ఎమ్‌ఐఎస్ (MIS) పోర్టల్ డ్యాష్‌బోర్డ్‌లో అప్‌డేట్ చేయాలని ఆదేశించారు.
గిన్నిస్ వరల్డ్ రికార్డ్ లక్ష్యం:
ఒకే రాష్ట్రంలో అత్యధిక మున్సిపాలిటీల్లో ఏకకాలంలో నిర్వహించిన అతిపెద్ద క్లీన్‌లీనెస్ డ్రైవ్‌గా దీనిని నిలిపి, “గిన్నిస్ వరల్డ్ రికార్డ్” సాధించేందుకు స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్, జియోస్టాట్ బృందాలు డాక్యుమెంటేషన్ సిద్ధం చేస్తున్నాయని ఇంచార్జి కలెక్టర్ తెలిపారు. ఈ ప్రతిష్టాత్మక రికార్డు సాధనలో మన జిల్లా ముందుండాలని ఆమె పిలుపునిచ్చారు. ఈ డ్రైవ్‌లో అద్భుతమైన ప్రతిభ కనబరిచిన ఉత్తమ మున్సిపాలిటీలకు రాష్ట్ర స్థాయి పురస్కారాలు ఉంటాయని పేర్కొంటూ.. ప్రజా ప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థలు, మహిళా సంఘాలు మరియు ప్రజలందరూ భాగస్వాములై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఇంచార్జి కలెక్టర్ సంజన సింహ కోరారు.
