బాల్యవివాహాలు చేసేవారిపై కేసులు నమోదు చేయాలి…!

బాల్యవివాహాలు చేసేవారిపై కేసులు నమోదు చేయాలి…!
జిల్లా ఇన్చార్జి కలెక్టర్ సంజనా సింహ.
“ఆంధ్రప్రభ ఎఫెక్ట్”
పల్నాడు బ్యూరో, ఆంధ్రప్రభ : బాల్య వివాహాలను నిర్మూలించాలి…బాల్యవివాహాలు చేసేవారిపై కేసులు నమోదు చేయాలి…బాలికా విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి…” అంటూ ఇంచార్జి కలెక్టర్ సంజన సింహ పిలుపునిచ్చారు. ఈనెల 12వ తేదీన ఆంధ్రప్రభ మొదటి పేజీ లో ప్రచురించిన ” బాలికకు బంధనాలు” అనే శీర్షికకు జిల్లా ఇన్చార్జి కలెక్టర్ సంజనా సింహ తీవ్రస్థాయిలో స్పందించారు. వెల్దుర్తి మండల0, రామచంద్రాపురం తండాలో జరగాల్సిన ఒక బాల్య వివాహాన్ని, దాచేపల్లిలో కూడా ఒక బాల్య వివాహాన్ని అడ్డుకొని సకాలంలో స్పందించి, అధికారులను అప్రమత్తం చేయడం ద్వారా ఇంచార్జి కలెక్టర్ సంజన సింహ విజయవంతంగా అడ్డుకోగలిగారు. ఈ సందర్భంగా జిల్లాలో బాల్య వివాహాలు నిర్మూలనపై తీసుకోవలసిన చర్యల పై ఆమె మంగళవారం ఒక ప్రకటన కూడా విడుదల చేశారు.
బాల్య వివాహాలు చట్ట విరుద్ధమని, నిర్మూలనకు సమాజం అంతా కలిసికట్టుగా పని చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. బాల్యవివాహాలు బాలికలు ఆరోగ్యం, విద్య, భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపుతాయని పేర్కొన్నారు. బాలికలకు విద్య అందించేందుకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. మహిళలు పురుషులతో దేంట్లోనూ తక్కువ కాదని, ఉన్నత విద్యావంతురాలైన తరవాత తన కాళ్లపై తాను నిలబడిన తరవాత వివాహం చేయాలన్నారు. జిల్లాలో ఎక్కడా బాల్య వివాహాలు జరగకుండా చూడాలని, ఎక్కడైనా బాల్యవివాహం జరుగుతున్నట్లు గుర్తిస్తే వెంటనే 1098 టోల్ ఫ్రీ నెంబర్ కు లేదా ఎమర్జెన్సీ పోలీస్ నంబర్ 112 కు కాల్ చేసి వివరాలు తెలియజేయవచ్చన్నారు.
