గూడేంలో బడిపిలుస్తుంది

గూడేంలో బడిపిలుస్తుంది
- పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించండి
- జిల్లా విద్యాశాఖ అధికారి ఎ. రవిబాబు
శ్రీకాకుళం, ఆంధ్రప్రభ: పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని జిల్లా విద్యాశాఖ అధికారి ఎ. రవిబాబు తెలిపారు. గూడేంలో నిర్వహించిన బడి పిలుస్తోంది కార్యక్రమంలో ఆయన బుధవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యా సంవత్సరంలో ప్రవేశాలపై ప్రభుత్వం ముందస్తుగానే దృష్టి సారించిందని, ఇందులో భాగంగా అంగన్వాడీ కేంద్రాల్లో చదువుతున్న పిల్లలను (5 సంవత్సరాలు పూర్తయిన వారు) ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించేలా ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
జిల్లాలో ఇప్పటికే ప్రక్రియను ప్రారంభించినట్లు వివరించారు. విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలలకు తరలించేందుకు పెద్దఎత్తున అవగాహన కల్పిస్తున్నట్లు వివరించారు. గడిచిన కొన్ని రోజులుగా క్షేత్రస్థాయిలో అధికారులు, ఉపాధ్యాయులు పర్యటిస్తున్నట్లు తెలిపారు. అంగన్వాడీ కేంద్రాలను సందర్శించి, పిల్లల ఇళ్లకు వెళ్లి తల్లిదండ్రులకు ప్రభుత్వం కల్పిస్తున్న ప్రోత్సాహకాలు, అందిస్తున్న పథకాలను వివరించి ప్రవేశాలను ప్రోత్సహిస్తున్నారు. గ్రామాల్లో ర్యాలీల ద్వారా అవగాహన కల్పిస్తున్నారు. జిల్లా విద్యాశాఖ అధికారితో సమగ్ర శిక్షా అధికారి పి. వేణుగోపాలరావుతో కలసి శ్రీకాకుళం మండలం గూడేం గ్రామంలో పర్యటించారు.
ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు, ఆధునిక బోధన, అధునాతన సామగ్రి, అర్హత గల ఉపాధ్యాయులు, ప్రవేశాలు పొందే వారికి ప్రభుత్వం అందిస్తున్న విద్యార్థి మిత్ర (పాఠ్యపుస్తకాలు, ఏకరూప దుస్తులు, నోట్ పుస్తకాలు, బ్యాగు, బెల్టు) పథకం ద్వారా ఉచితంగా కిట్ల పంపిణీ, మధ్యాహ్న భోజన పథకం (డొక్కా సీతమ్మ) ద్వారా పౌష్టికాహారం, తదితరాల గురించి తెలియజేస్తూ ప్రభుత్వ పాఠశాలల్లో తమ పిల్లలను చేర్పించాలని తల్లిదండ్రులను ఆయన కోరారు. గూడేంలో నిర్వహించిన బడి పిలుస్తుంది కార్యక్రమంలో 22 మంది విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించినట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో ఎంపిటిసి శార్వాణి, ఎపిసి పి. వేణుగోపాలరావు, డిప్యూటీ డిఈఓ విజయ కుమారి, పాఠశాల కమిటీ అధ్యక్షులు కె. యర్రయ్య, ఎంఈఓలు నత్తల కృష్ణ, పెంకి సుజాత, సిఎంఓ బి. శ్రీధర్, ఎఎంఓ సుధాకర్, ఉపాధ్యాయులు, విద్యా శాఖ సిబ్బంది పాల్గొన్నారు.
