విద్యలో విప్లవాత్మక మార్పులకు సీఎం దిశానిర్దేశం

విద్యలో విప్లవాత్మక మార్పులకు సీఎం దిశానిర్దేశం

అమరావతి, ఆంధ్రప్రభ: విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకురావడానికి వివిధ కోర్సులను రూపొందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా కోర్సుల ఫోర్‌కాస్టింగ్ జరగాలన్నారు. రాష్ట్ర సచివాలయంలో గురువారం విద్యాశాఖపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. పాఠశాల, ఇంటర్, ఉన్నత విద్య, నైపుణ్యాభివృద్ధి అంశాలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలు అందిస్తున్న కోర్సులను రీస్ట్రక్చర్ చేయాలని సూచించారు.

రిసెర్చ్, ఇన్నోవేషన్, స్టార్టప్‌లను ప్రోత్సహించేలా మార్పులు చేపట్టాలని స్పష్టం చేశారు. విశ్వవిద్యాలయాలు పరిశోధనలు, ఆవిష్కరణలకు కేంద్రాలుగా మారాలని పేర్కొన్నారు. లాజిస్టిక్స్, గ్రీన్ ఎనర్జీ వంటి రంగాల్లో కొత్త కోర్సులు ప్రారంభించాలని సూచించారు. క్వాంటం టెక్నాలజీపై రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా కోర్సు ప్రారంభించినందుకు ఆంధ్రా యూనివర్సిటీని సీఎం అభినందించారు. అంతర్జాతీయ స్థాయిలో పోటీపడేలా రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలు తయారవ్వాలని స్పష్టం చేశారు. వరల్డ్ టాప్ 200 యూనివర్సిటీలతో భాగస్వామ్యాలు కుదుర్చుకోవాలని సూచించారు.

ప్రతి యూనివర్సిటీకి ఒక పారిశ్రామిక సంస్థను అనుసంధానం చేయాలని, జర్మన్ సహా విదేశీ భాషల్లో శిక్షణ కోసం ప్రత్యేక విభాగాలను ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. ప్రాథమిక స్థాయి నుంచి పీజీ వరకు పాఠ్యాంశాలను ఆధునీకరించడంతో పాటు కెరీర్ బిల్డింగ్, కేరక్టర్ బిల్డింగ్‌కు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. ఈ దిశగా ఐఐటీ చెన్నై వంటి ప్రతిష్టాత్మక సంస్థల సిఫార్సులను తీసుకుని అమలు చేయాలని ఆదేశించారు. యూనివర్సిటీ రికార్డులను ఆన్‌లైన్‌లోకి తీసుకురావాలని కూడా సూచించారు. త్వరలో రాష్ట్రంలో లాజిస్టిక్స్, ఏవియేషన్, హార్టికల్చర్ రంగాల్లో ప్రతిష్టాత్మక యూనివర్సిటీలు ఏర్పాటు చేసే ప్రతిపాదనలు ఉన్నాయని తెలిపారు.


త్వరలో స్టూడెంట్స్ ఇన్నోవేషన్ కాంక్లేవ్

విద్యార్థులకు పోషకాహారం అందేలా మధ్యాహ్న భోజన మెనూను రూపొందించాలని సీఎం సూచించారు. విద్యార్థుల మానసిక, శారీరక ఎదుగుదలకు అనుగుణంగా ఆహారం అందించాలని పేర్కొన్నారు. హాస్టళ్లు, రెసిడెన్షియల్ పాఠశాలల్లో కిచెన్ గార్డెన్లు అభివృద్ధి చేయాలని సూచించారు. ‘లీప్’ యాప్ ద్వారా తల్లిదండ్రులు విద్యార్థుల హాజరు, పురోగతిని తెలుసుకునేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్స్ ద్వారా ఉత్తమ ఉపాధ్యాయులతో వీడియో పాఠాలు అందిస్తే బోధన నాణ్యత పెరుగుతుందని సూచించారు. ఏజెన్సీ ప్రాంతాల్లో కూడా సాంకేతిక ఆధారిత విద్య అందించాలని ఆదేశించారు. విద్యార్థుల్లో సృజనాత్మకత పెంచేందుకు ఏఐ కాన్ఫరెన్స్ నిర్వహించి, దానికి “స్టూడెంట్స్ ఇన్నోవేషన్ కాంక్లేవ్”గా పేరు పెట్టాలని సూచించారు. ఆటిజం సహా దివ్యాంగ విద్యార్థులకు విద్యలో ఎలాంటి ఆటంకాలు లేకుండా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని తెలిపారు. క్రీడలతో పాటు కో-కరిక్యులర్ యాక్టివిటీస్ పెంచాలని, ఇంటర్ స్థాయిలో విద్యార్థులకు విభిన్న కాంబినేషన్లలో కోర్సులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.


డిమాండ్‌కు అనుగుణంగా కొత్త కోర్సులు: మంత్రి లోకేష్

పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా కోర్సులను రీస్ట్రక్చర్ చేస్తున్నామని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. విద్యారంగంలో చేపడుతున్న సంస్కరణలను ముఖ్యమంత్రికి వివరించారు. పాఠశాలల్లో “వన్ క్లాస్ – వన్ టీచర్” విధానాన్ని విస్తరించామని, నమోదు సంఖ్యను పెంచుతున్నామని తెలిపారు. ప్రాథమిక స్థాయి నుంచి ఉన్నత విద్య వరకు పాఠ్యాంశాలను ఆధునీకరించడంతో పాటు బ్రిడ్జ్ కోర్సులు అందిస్తున్నామని చెప్పారు.

ఎన్సీఈఆర్టీ సహకారంతో పాఠ్యాంశాలను ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా మార్చుతున్నామని తెలిపారు. ఉపాధ్యాయులకు రీఓరియంటేషన్ కార్యక్రమాలు నిర్వహిస్తూ, కొందరిని ఫిన్లాండ్ వంటి దేశాలకు పంపిస్తున్నామని చెప్పారు. పాఠశాలలు, కళాశాలల్లో పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు.


నైపుణ్యాలపై ఆడిట్

రాష్ట్ర యువత నైపుణ్యాలపై ర్యాండమ్ స్కిల్ ఆడిట్ నిర్వహించాలని సీఎం సూచించారు. ఫౌండేషనల్ లిటరసీ, న్యూమరసీలో రాష్ట్రాన్ని ముందంజలో ఉంచాలని మంత్రి తెలిపారు. టీచర్–స్టూడెంట్–అవుట్‌కమ్ విధానంతో విద్యారంగంలో మార్పులు తీసుకువస్తున్నామని పేర్కొన్నారు. ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో క్లాస్ అవర్స్ పెంచి పోటీ పరీక్షలకు సిద్ధం చేసేలా శిక్షణ ఇస్తున్నామని తెలిపారు.

నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాల ద్వారా అందరికీ స్కిల్ అసెస్‌మెంట్ నిర్వహిస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో 20 లక్షల మందికి నైపుణ్యాలతో ఉద్యోగాలు కల్పించే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నామని సీఎం తెలిపారు. పీఎంసేతు ప్రాజెక్ట్ ద్వారా ఐటీఐలను హబ్-అండ్-స్పోక్ మోడల్‌లో అభివృద్ధి చేయాలని సూచించారు. ఎనర్జీ, లాజిస్టిక్స్, క్వాంటం, ఏఐ రంగాల్లో నైపుణ్యాలను పెంచాలని, ఉద్యోగ అవకాశాలపై సమీకృత పోర్టల్ ద్వారా సమాచారం అందించాలని ఆదేశించారు.

Leave a Reply