(ఆంధ్రప్రభ, ఇబ్రహీంపట్నం) : సంస్కృతి, చారిత్రక సంపద పరిరక్షణలో మ్యూజియాల పాత్ర విశిష్టమైనదని, ఇవి విభిన్న సంస్కృతులను తరతరాలకు పరిచయం చేసే విజ్ఞాన భాండాగారాలని, మ్యూజియాలు కేవలం జ్ఞాపకాల గదులు మాత్రమే కాదని, అవి మన నాగరికతకు దర్పణాలని జిల్లా కలెక్టర్ డా.జి.లక్ష్మీశ అన్నారు. ఆదివారం అంతర్జాతీయ మ్యూజియం దినోత్సవం సందర్భంగా కలెక్టర్ లక్ష్మీశ.. ఆర్కియాలజీ, రెవెన్యూ, పర్యాటకం, పట్టణ పరిపాలన తదితర శాఖల అధికారులు, అడ్వెంచర్, టూర్స్ అండ్ ట్రావెల్స్ అసోసియేషన్ల ప్రతినిధులతో కలిసి కొండపల్లి కోటలోని మ్యూజియంను సందర్శించారు. కొండపల్లి బొమ్మల కళాకారుల వీధి నుంచి ఖిల్లాకు ట్రెక్కింగ్ చేశారు. కొండపల్లి ఖిల్లా ప్రాంత గొప్ప వారసత్వ పరిరక్షణపై నిబద్ధతను చాటిచెప్పే లక్ష్యంతో ఈ పర్యటన చేయడం జరిగింది.
ఈసందర్భంగా కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ… వేగంగా మారుతున్న సమాజాల్లో మ్యూజియాల భవిష్యత్తు అనే ఇతివృత్తంతో ఈ ఏడాది అంతర్జాతీయ మ్యూజియం దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని, ఆధునిక సమాజ అవసరాలకు అనుగుణంగా, చారిత్రక వారసత్వాన్ని కాపాడుతూ మ్యూజియాల అభివృద్ధి చెందుతున్న తీరుకు ఇది అద్దం పడుతుందని పేర్కొన్నారు. చారిత్రక ఔన్నత్యాన్ని కళ్ల ముందుంచే సజీవ తరగతి గదులైన మ్యూజియాలను ప్రజలు ముఖ్యంగా యువత, విద్యార్థులు సందర్శించాలని.. విజయవాడలోని బాపూ మ్యూజియం, కొండపల్లికోటలోని మ్యూజియం వంటివాటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
సమాజంలో మ్యూజియాల విశిష్టతపై ప్రతిఒక్కరూ అవగాహన పెంపొందించుకోవాలి.. విద్యా సంస్థలు, పౌర సమాజం, ప్రజలు ఇలాంటి వారసత్వ కార్యక్రమాలకు మద్దతిచ్చి, భాగస్వాములు కావాలని కలెక్టర్ లక్ష్మీశ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో విజయవాడ ఆర్‌డీవో కావూరి చైతన్య, జిల్లా పర్యాటక అధికారి ఎ.శిల్ప, డీఎఫ్‌వో సతీష్, కొండపల్లి మునిసిపల్ కమిషనర్ రమ్య కీర్తన, ఏపీ అడ్వెంచర్ అసోసియేషన్, విజయవాడ ప్రెసిడెంట్ తరుణ్ కాకాని, ఏపీ టూరిజం అథారిటీ కన్సల్టెంట్ సాహితి, టూర్స్ అండ్ ట్రావెల్ అసోసియేషన్ ప్రతినిధులు, తదితరులు హాజరయ్యారు.