Agra Murder | 45 రోజుల తర్వాత మోసం గుట్టురట్టు
Agra Murder | 45 రోజుల తర్వాత మోసం గుట్టురట్టు
Agra Murder | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో అత్యంత దారుణమైన హత్య ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ మహిళ తన భర్తను పాయసంలో నిద్రమాత్రలు కలిపి ఇచ్చి, ఆ తర్వాత అతడు స్పృహ కోల్పోయిన సమయంలో గొంతు నులిమి హత్య చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
పోలీసుల వివరాల ప్రకారం… హత్య అనంతరం నిందితురాలు భర్త మృతదేహాన్ని ఇంటి బాత్‌రూమ్ నేల కింద రహస్యంగా పాతిపెట్టింది. అనంతరం అతను కనిపించకుండా పోయాడని కుటుంబ సభ్యులు, బంధువులు, సమాజాన్ని నమ్మించే ప్రయత్నం చేసినట్లు తెలుస్తోంది. సుమారు 45 రోజుల పాటు ఈ ఘటనను పూర్తిగా దాచిపెట్టినట్లు పోలీసులు తెలిపారు.
అయితే మరో కేసు దర్యాప్తు నిమిత్తం ఇంటికి వచ్చిన పోలీసులకు అనుమానం కలగడంతో విచారణ ప్రారంభమైంది. ఇంటి పరిసరాల్లో అనుమానాస్పద పరిస్థితులు కనిపించడంతో లోతుగా దర్యాప్తు జరపగా అసలు విషయం బయటపడింది. దీంతో బాత్‌రూమ్ కింద పాతిపెట్టిన మృతదేహాన్ని వెలికితీసినట్లు సమాచారం.
నిందితురాలిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. హత్యకు గల కారణాలు, ముందస్తు ప్రణాళికపై మరింత దర్యాప్తు కొనసాగుతోందని అధికారులు తెలిపారు. ఈ ఘటన ఆగ్రా ప్రాంతంలో తీవ్ర సంచలనం సృష్టించింది.

