పేదలకు అండగా నిలుస్తున్న ప్రభుత్వం..
- ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు సేవలు అభినందనీయం…
- టీడీపీ నేత ఘంటా కృష్ణమోహన్
విజయవాడ, ఆంధ్రప్రభ : విజయవాడ 30వ డివిజన్ విజయ్ దుర్గా నగర్లో ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యుడు బొండా ఉమామహేశ్వరరావు సూచన మేరకు నాగమల్లేశ్వరరావుకి ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా మంజూరైన రూ.41,744 చెక్కును క్లస్టర్ ఇన్చార్జ్ ఘంటా కృష్ణమోహన్ తెలుగుదేశం పార్టీ నాయకులతో కలిసి వారి నివాసానికి వెళ్లి అందజేశారు.
ఈ సందర్భంగా కుటుంబ సభ్యుడు ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఘంటా కృష్ణమోహన్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి సహాయనిధి నిరుపేదలకు ఆపద్బాంధవంగా నిలుస్తోందని అన్నారు.
ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న కుటుంబాలకు వైద్య చికిత్సలు, అత్యవసర అవసరాల కోసం ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా అందుతున్న ఆర్థిక సాయం ఎంతో ఉపయోగపడుతోందని పేర్కొన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఈ పథకం ప్రయోజనాలు అందేలా ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారని తెలిపారు.
సెంట్రల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు నాయకత్వంలో ఇప్పటికే రూ.500 కోట్లకు పైగా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అమలవుతున్నాయని చెప్పారు. రహదారులు, డ్రైనేజీలు, తాగునీటి సదుపాయాలు, విద్యుత్, పార్కుల అభివృద్ధి, కమ్యూనిటీ హాళ్లు వంటి మౌలిక వసతులతో పాటు ప్రజల అవసరాలకు అనుగుణంగా అనేక అభివృద్ధి పనులు చేపట్టడం జరిగిందన్నారు.
అదేవిధంగా ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా వందలాది మంది పేదలకు ఆర్థిక చేయూత అందించడమే కాకుండా, P-4 కార్యక్రమం ద్వారా తోపుడుబండ్లు, టిఫిన్ బండ్లు, ఇస్త్రీ బండ్లు, కుట్టు మిషన్లు వంటి స్వయం ఉపాధి సాధనాలను పంపిణీ చేసి పేద కుటుంబాలకు జీవనోపాధి కల్పిస్తున్నారని కొనియాడారు.
విద్యార్థులకు విద్యా సహాయం, అనారోగ్యంతో బాధపడుతున్న వారికి వైద్య సహాయం, నిరుపేద కుటుంబాలకు అవసరమైన ప్రతి సందర్భంలో అండగా నిలుస్తూ ప్రజాసేవలో ఎమ్మెల్యే నిరంతరం ముందుంటున్నారని అన్నారు. ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేయడంతో పాటు సంక్షేమ పథకాలు ప్రతి అర్హుడికి చేరేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్న ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు సేవలు ఆదర్శనీయమని ఘంటా కృష్ణమోహన్ పేర్కొన్నారు. డివిజన్ అధ్యక్షులు లక్కం రాజు శ్రీనివాసరాజు, ఇన్చార్జి కరణం వెంకటరమణ, ప్రధాన కార్యదర్శి వీరభద్రం, కనకారావు తదితరులు పాల్గొన్నారు.
