Rs.15 crore | బీఆర్ ఎస్ హయాంలో ప్రజాధనం వృధా

Rs.15 crore | బీఆర్ ఎస్ హయాంలో ప్రజాధనం వృధా
- ఇసుక మాఫియాతో రోడ్లు అధ్వాన్నం
- అసంపూర్తిగా భవనాలు
- సంక్షేమం, అభివృద్ధి కాంగ్రెస్ తోనే
- బ్లాక్ లిస్ట్ నుండి 645 ఇండ్ల తొలగింపుకై కలెక్టర్‌కు ఫోన్
- తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్
Rs.15 crore | మోత్కూర్, ఆంధ్రప్రభ : బీఆర్ ఎస్ హయాంలో మోత్కూర్ మున్సిపాలిటీలో అసంపూర్తి పనులతో ప్రజా ధనం కాస్త వృధా అయ్యిందని, ఇసుక మాఫియా అక్రమ దందాలు, కమిషన్ల కోసమే కోట్లాది రూపాయలు మంజూరు చేసి ఏ ఒక్క పని కూడా పూర్తి కాలేదని తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్ అన్నారు. ఈ రోజు మోత్కూర్ లో ఎమ్మెల్యే సామెల్ విలేకరులతో మాట్లాడుతూ… మున్సిపల్ భవనం, మినీ ట్యాంక్ బండ్, ఇంటిగ్రేటెడ్ మార్కెట్(integrated market), డంపింగ్ యార్డ్, వైకుంఠ ధామం, ధోభీ ఘాట్ అభివృద్ధి పనులకు నిధులు లేక అసంపూర్తిగా నిలిచిపోయాయని విమర్శించారు.
కాంగ్రెస్ హయాంలో మోత్కూర్ మెయిన్ రోడ్డు సీసీ, డ్రైనేజీ, కల్వర్టు బాక్స్ లు ఏర్పాటు చేసి రోడ్లను అద్దంలా తీర్చిదిద్దామన్నారు. గెస్ట్ హౌజ్‌కి ప్రహరీ నిర్మాణంతో పాటు మరమ్మతులు చేసినట్లు తెలిపారు. రూ.50 లక్షలతో అగ్నిమాపక కేంద్రం భవనం నిర్మిస్తున్నట్లు తెలిపారు. మున్సిపాలిటీలో రూ.15 కోట్ల(Rs.15 crore)తో జామాచెట్ల బావి కొండాపురం వరకు బీటీ రోడ్డు శంకుస్థాపన చేయగా త్వరలోనే పనులు ప్రారంభం చేస్తామని, మినహా రూ.15 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేసి అంబేద్కర్ చౌరస్తా నుండి ఇందిరానగర్ వరకు రోడ్డు వెడల్పు, డ్రైవర్స్ కాలని, పద్మ శాలి కాలని లో సీసీ రోడ్డు నిర్మాణం, రూ.2.5 కోట్లతో అంబేద్కర్ పూలే పేరుతో స్టడీ సర్కిల్, రూ. 1.50 కోట్లతో డివైడర్ లో మొక్కల పెంపకం, రూ.1 కోటితో చెరువు కట్ట మరమ్మతులు చేపట్టనున్నట్లు తెలిపారు.
మున్సిపాలిటీ అభివృద్ధి కై కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని, రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో మోత్కూర్, తిరుమలగిరి మున్సిపాలిటీలలో అన్ని వార్డుల్లో కాంగ్రెస్ జెండా ఎగురవేయాలని కోరారు. చెరువు కట్ట వద్ద శిఖం భూమిలో సీఎం, మంత్రి అనుమతి తీసుకొని కాసోజు శ్రీకాంతాచారి విగ్రహం ఏర్పాటు తో పాటు, కమర్షియల్ షెట్టర్లు(commercial shetters) ఏర్పాటు చేసి మున్సిపాలిటీకి ఆదాయ వనరులు సమకూరుస్తామన్నారు.
మున్సిపాలిటీలో 645 ఇండ్లు బ్లాక్ లిస్టులో పెట్టారని తక్షణమే సదరు ఇండ్ల జాబితాను బ్లాక్ లిస్ట్ నుండి తొలగించాలని జిల్లా కలెక్టర్ హనుమంతరావుకి ఎమ్మెల్యే సామెల్ స్వయంగా ఫోన్ చేసి కోరగా, సోమవారం డిలీట్ కోసం ప్రతిపాదనలు పంపిస్తామని, మరో 2,3 రోజుల్లో జాబితా నుండి తొలగిస్తామని ఎమ్మెల్యే కు కలెక్టర్ తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు ఫైళ్ల సోమిరెడ్డి, జిల్లా కాంగ్రెస్ నాయకులు డా. గుర్రం లక్ష్మీనరసింహ రెడ్డి, అవిశెట్టి అవిలిమల్లు, పట్టణ అధ్యక్షుడు గుండగొని రామచంద్రు, పన్నాల శ్రీనివాస్ రెడ్డి, పోచం జగన్,పి స్వామి రాయుడు, పల్లెర్ల వెంకన్న తదితరులు పాల్గొన్నారు.
