Bangladesh | హిందువులే టార్గెట్..

Bangladesh | హిందువులే టార్గెట్..
- నౌగావో జిల్లాలో దుర్ఘటన
Bangladesh | వెబ్ డెస్క్, ఆంధ్రప్రభ : బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులు ఆగడం లేదు. హిందువులు లక్ష్యంగా చేసుకుని దాడులు జరుగుతున్నాయి. దీంతో హిందువులు ఆందోళన చెందుతున్నారు. బంగ్లాదేశ్ లో (Bangladesh) మరో హిందువు ఈ రోజు మరణించాడు. స్థానికులు దాడికి ప్రయత్నిస్తుండగా పారిపోతూ ఒక కాలువలో దూకి, ప్రాణాలు కోల్పోయాడు. నౌగావో జిల్లాలోని మొహదేవపూర్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. మృతుడిని 25 ఏళ్ల మిథున్ సర్కార్ గా గుర్తించారు. మిథున్ సర్కార్ ను చోరీ చేశాడనే నెపంతో స్థానికులు గుంపుగా వెంటాడి పట్టుకునేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో మిథున్ పారిపోతూ పక్కనే ఉన్న కాలువలోకి దూకి రక్షించుకోవాలనుకున్నాడు. కానీ ప్రాణాలు కోల్పోయాడు.
Bangladesh | నిన్న వ్యాపారి హత్య
బంగ్లాదేశ్‌లో రాణాప్రతాప్ బైరాగి అనే జర్నలిస్టు హత్య జరిగిన 24 గంటల్లోపే మరో హిందూ వ్యాపారిని చంపేశారు. నర్సింగ్డీ జిల్లాలో కిరాణ షాపు నిర్వహించే వ్యాపారిని దుండగులు కత్తులతో దాడి చేశారు. నర్సింగ్డీ జిల్లాలో అత్యంత రద్దీగా ఉండే చార్‌సింధూర్ బజార్‌లో మణి చక్రవర్తి కిరాణ దుకాణం నిర్వహిస్తున్నారు. సోమవారం (Monday) రాత్రి అతను షాపులో ఉండగా కొద్దమంది దుండగులు షాపులోకి చొరబడ్డారు. అనంతరం పదునైన ఆయుధాలతో దాడి చేసి అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఇది గమనించిన స్థానికులు.. తీవ్రంగా గాయపడిన మణి చక్రవర్తిని హుటాహుటిన స్థానిక ఆస్పత్రికి తరలించారు. కానీ అప్పటికే మణి చక్రవర్తి ప్రాణాలు కోల్పోయాడు.
Bangladesh | రెండు రోజుల కిందట జర్నలిస్టు హత్య
మణి చక్రవర్తి హత్యకు కొద్ది గంటల ముందు జర్నలిస్టు రాణా ప్రతాప్ (Rana Prathap) బైరాగిని దారుణంగా హత్య చేశారు. జెస్సోర్ జిల్లా కేశవ్‌పూర్ గ్రామానికి చెందిన దైనిక్ బీడీ ఖబర్ పత్రికకు బైరాగి యాక్టింగ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాడు. మణిరాంపూర్‌లోని కొపాలియా బజార్‌లో ఐస్ ఫ్యాక్టరీని కూడా నిర్వహిస్తున్నాడు. సోమవారం ఫ్యాక్టరీ దగ్గరకు బైక్‌పై వచ్చిన ముగ్గురు దుండగులు బైరాగిని బటయకు పిలిచారు. అనంతరం పక్కనే ఉన్న గల్లీలోకి తీసుకెళ్లి తుపాకీతో మూడుసార్లు కాల్చారు. అనంతరం అతని గొంతు కోసి చంపేశారు.
