Sachin Tendulkar | ముహూర్తం ఫిక్స్..?

Sachin Tendulkar | ముహూర్తం ఫిక్స్..?
- మార్చిలో అర్జున్ టెండూల్కర్ వివాహం
- వ్యాపారవేత్త రవి ఘాయ్ మనవరాలు సానియా చందోక్‌తో పెళ్లి
Sachin Tendulkar | వెబ్‌డెస్క్ (స్పోర్ట్స్), ఆంధ్రప్రభ : భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ఇంటిలో త్వరలోనే పెళ్లి బాజా మోగనుంది. ఆయన కుమారుడు, యువ క్రికెటర్ అర్జున్ టెండూల్కర్ ఓ ఇంటివాడు కాబోతున్నాడు. తన ప్రియురాలు, వ్యాపారవేత్త అయిన సానియా చందోక్‌ను ఆయన వివాహం చేసుకోనున్నాడు. కొంతకాలంగా వీరి పెళ్లి గురించి ప్రచారం జరుగుతున్నప్పటికీ, తాజాగా వివాహ తేదీలు ఖరారైనట్లు సమాచారం. ఈ ఏడాది మార్చిలో వీరి వివాహ వేడుక జరగనుంది.
తాజాగా వచ్చిన కథనాల ప్రకారం వీరి పెళ్లి వేడుకలు మార్చి 3న ప్రారంభమై, 5న ముంబైలో ప్రధాన కార్యక్రమం జరగనుంది. ఈ వేడుకను అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యులు, కొద్దిమంది క్రికెటర్ల సమక్షంలో చాలా ప్రైవేట్‌గా నిర్వహించాలని ఇరు కుటుంబాలు నిర్ణయించుకున్నాయి. వాస్తవానికి అర్జున్, సానియా నిశ్చితార్థం గత ఏడాది ఆగస్టులోనే అత్యంత రహస్యంగా జరిగింది. అప్పట్లో ఈ విషయం బయటకు రాలేదు.

ఈ వార్తను స్వయంగా సచిన్ టెండూల్కర్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘రెడిట్’లో నిర్వహించిన ‘ఆస్క్ మీ ఎనీథింగ్’ సెషన్లో ధ్రువీకరించారు. “అర్జున్‌కు నిశ్చితార్థం జరిగిందా?” అని ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు సచిన్ స్పందిస్తూ, “అవును, జరిగింది. అతని జీవితంలో ఈ సరికొత్త ప్రయాణం కోసం మేమంతా ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తున్నాం” అని బదులిచ్చారు. ఇక వధువు సానియా చందోక్ విషయానికొస్తే, ఆమె ఒక వ్యాపారవేత్త. ముంబైకి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త రవి ఘాయ్ మనవరాలు. కొంతకాలంగా ఆమె టెండూల్కర్ కుటుంబానికి చాలా సన్నిహితంగా ఉంటున్నారు.
- సానియా చందోక్ ఎవరంటే..?

సానియా చందోక్ ముంబైకి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త రవి ఘాయ్ మనవరాలు. గ్రావిస్ గ్రూప్ అధినేత అయిన రవి ఘాయ్ హాస్పిటాలిటీ, ఫుడ్ ఇండస్ట్రీల్లో ప్రముఖ వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. ఇంటర్కాంటినెంటల్ హోటల్, బ్రూక్లిన్ క్రీమరీ, మెరైన్ డ్రైవ్ వంటి సంస్థలు ఆయన ఆధ్వర్యంలోనే ఉన్నాయి.
CLICK HERE TO READ గర్ల్‌ఫ్రెండ్ సోఫిని వివాహం చేసుకోబోతున్న శిఖర్ ధావన్
