julurupadu | విద్యుత్ సమస్యల పరిష్కారానికి టోల్ ఫ్రీ 1912

julurupadu | విద్యుత్ సమస్యల పరిష్కారానికి టోల్ ఫ్రీ 1912
- జూలూరుపాడు గ్రామంలో విద్యుత్ శాఖ ప్రజా బాట కార్యక్రమం
- విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ కాలిపోయి నెలన్నర రోజులైనా నేటి వరకు మరొకటి ఏర్పాటు చేయలేదు
- విద్యుత్ సమస్యలు పరిష్కారానికి రోజులు పడుతున్నాయి
- విద్యుత్ సిబ్బంది కొరత కారణంగా తీవ్ర ఇబ్బందులు
- భద్రాద్రి కొత్తగూడెం జిల్లా విద్యుత్ శాఖ ఎస్ఈ ఆపరేషన్స్ మహేందర్
julurupadu | జూలూరుపాడు, ఆంధ్రప్రభ : విద్యుత్ వియోగదారులు, రైతులు సమస్యల పరిష్కారానికి టోల్ ఫ్రీ నంబర్ 1912 కు కాల్ చేయాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్ఈ మహేందర్ కోరారు. ఇవాళ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు గ్రామంలో నిర్వహించిన విద్యుత్ శాఖ ప్రజా బాట కార్యక్రమంలో ఎస్ఈ పాల్గొన్నారు. వ్యవసాయ మోటర్లు వినియోగించే రైతులు, గృహ విద్యుత్ వినియోగదారుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. విద్యుత్ శాఖ నాణ్యమైన నిరంతర విద్యుత్ ను సరఫరా చేస్తుందని చెప్పారు. వినియోగదారుల సమస్యలను పరిష్కరించేందుకు విద్యుత్ శాఖ ప్రజాబాట కార్యక్రమం చేపట్టినట్లు వెల్లడించారు.
విద్యుత్ సరఫరా చేసే కరెంట్ పోల్స్ కు మధ్య అవసరమైన చోట మిడిల్ పోల్స్ ఏర్పాటు చేస్తామని ఎస్ఈ చెప్పారు. కిందకు ఉండి ప్రజలకు ప్రమాదకరంగా మారిన విద్యుత్ లైన్లను సరి చేస్తామన్నారు. ఈ సందర్భంగా పలువురు రైతులు తమ సమస్యలను ఎస్ఈ ఆపరేషన్స్ మహేందర్ దృష్టికి తీసుకువెళ్ళారు. గత పదేళ్ల క్రితం మర్మత్తులకు గురైన ట్రాన్స్ ఫార్మర్ ను నేటివరకు రైతులకు అందుబాటులోకి తీసుకు రాలేదన్నారు. గత నెల పదిహేను రోజుల క్రితం ట్రాన్స్ ఫార్మర్ కాలిపోయిందని, నేటి వరకు మరొక ట్రాన్స్ ఫార్మర్ ఏర్పాటు చేయకపోవడంతో వ్యవసాయానికి సాగునీరు లేక తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నామని గుండెపున్ని మధుసూదన్ రావు అనే రైతు ఎస్ఈ ఎదుట అవేదన వ్యక్తం చేశారు.
పొలాల్లో విద్యుత్ స్తంభాలు అస్తవ్యస్థంగా ఉన్నాయని, సుబాబుల్ పంటకు పోల్స్ అడంకిగా ఉన్నాయని తెలిపారు. విద్యుత్ సమస్యలు ఏర్పడినప్పుడు మరమ్మత్తులు చేసేందుకు విద్యుత్ సిబ్బంది సకాలంలో పనులు పూర్తి చేయడంలేదన్నారు. ఈ సందర్భంగా ఎస్ఈ మహేందర్ రైతుల సమస్యలను సత్వరమే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. పొలాల్లో విద్యుత్ స్తంభాలు మార్చుకునేందుకు రైతులు సొంత ఖర్చులు పెట్టుకునేందుకు ముందుకు వస్తే విద్యుత్ శాఖ అధికారులు లైన్ కు ఎస్టిమేషన్ వేసి అనుమతులు ఇస్తామన్నారు.
జిల్లా వ్యాప్తంగా 22 మండలాలు, పట్టణాల్లో 150 విద్యుత్ శాఖ సిబ్బంది పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు. ప్రభుత్వం విద్యుత్ పోస్టులను భర్తీ చేస్తుందని, సమస్యలు పరిష్కారం అవుతాయని రైతులకు ఎస్ఈ భరోసానిచ్చారు. విద్యుత్ శాఖ వినియోగదారులు టోల్ ఫ్రీ నంబర్ 1912 కు కాల్ చేసి సమస్యలను చెప్పాలని, ఫిర్యాదుదారుని పేరు, సమస్యను రిజిస్టర్ లో నమోదు చేస్తారన్నారు. ఆన్ లైన్ లో అధికారులు సమస్య పరిష్కారమైనది.. లేనిది మానిటరింగ్ చేస్తారన్నారు. విద్యుత్ శాఖ ప్రజాబాట కార్యక్రమంలో డీఈ వెంకటేష్, ఏడీఈ లు రవి కుమార్,
రాంబాబు, ఏఈ ప్రవీణ్, లైన్ మెన్ నల్గట్ల భాస్కర్, రైతులు చిలుకూరి రమేష్, గుండెపున్ని వెంకటేశ్వర్లు, పెంటికల వీరబాబు, తదితరులు పాల్గొన్నారు.
