Championship | సత్తా చాటిన కర్నూలు క్రీడాకారులు..

Championship | సత్తా చాటిన కర్నూలు క్రీడాకారులు..
Championship, కర్నూలు బ్యూరో, ఆంధ్రప్రభ : జాతీయస్థాయిలో నిర్వహించిన ట్రెడిషనల్ ఆర్చరీ ఛాంపియన్షిప్‌లో కర్నూలు జిల్లాకు చెందిన క్రీడాకారులు విశేష ప్రతిభను కనబరిచి జిల్లా ఖ్యాతిని ఇనుమడింపజేశారు. డిసెంబర్ 27, 28, 29 తేదీల్లో హైదరాబాద్ ఖైరతాబాద్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రాంగణంలో నిర్వహించిన 5వ జాతీయ స్థాయి ట్రెడిషనల్ ఆర్చరీ ఛాంపియన్షిప్‌లో ఆంధ్రప్రదేశ్ ట్రెడిషనల్ ఆర్చరీ అసోసియేషన్ తరఫున మొత్తం 30 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. ఈ పోటీల్లో పాల్గొన్న క్రీడాకారులు 7 బంగారు పతకాలు, 6 వెండి పతకాలు, 10 కాంస్య పతకాలు సాధించి రాష్ట్రానికి గౌరవం తీసుకువచ్చారు. జాతీయస్థాయిలో బంగారు పతకాలు సాధించడం ఎంతో కష్టతరమని, అలాంటి ఘనత సాధించిన వారిలో కర్నూలు జిల్లాకు చెందిన క్రీడాకారులు ఉండడం గర్వకారణమని కర్నూలు డీఐజీ, ఇన్‌చార్జ్ ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. భవిష్యత్తులో అంతర్జాతీయ స్థాయిలో కూడా రాణించాలని ఆకాంక్షించారు.
బంగారు పతకాలు సాధించిన వారిలో విమల్, స్కందన్, మాధురి, లలిత, భావేష్, ప్రమోద్, శ్రీజ ఉన్నారు. వెండి పతకాలు సాధించిన వారిగా హోమిత, కృతిక, అవంతిక, తన్‌వీర్, ఈషిత, హుస్సేన్ నిలిచారు. ఈ కార్యక్రమంలో ట్రెడిషనల్ ఆర్చరీ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆర్గనైజింగ్ సెక్రటరీ ఎన్. వేణుగోపాల్ రెడ్డి, క్రీడాకారుల తల్లిదండ్రులు, కర్నూలు త్రీ టౌన్ ఎస్సై ఏ.పీ. శ్రీనివాసులు, కర్నూలు డీఎస్పీ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న మహిళా పోలీస్ కానిస్టేబుల్ మాధవి తదితరులు పాల్గొన్నారు. కర్నూలు జిల్లా నుంచి ఇలాంటి ప్రతిభావంతులు వెలుగులోకి రావడం గర్వకారణమని పలువురు అభినందనలు తెలిపారు.

