Prajadarbar | ప్రజల వద్దకే పాలన…

Prajadarbar | ప్రజల వద్దకే పాలన…
- సమస్య మీది.. పరిష్కారం మాది..
- కీసర గ్రామ ప్రజా దర్బార్‌లో పాల్గొన్న ప్రభుత్వ విప్,ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య
Prajadarbar | (ఆంధ్రప్రభ కంచికచర్ల) : ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల మండలం కీసర గ్రామంలో ఇవాళ నిర్వహించిన ప్రజాదర్బార్ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, కూటమి నేతలు పాల్గొని ప్రజల నుంచి నేరుగా సమస్యలను స్వీకరించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య మాట్లాడుతూ… ప్రజల వద్దకే పాలన అనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోందని, సమస్య ప్రజలదైతే, పరిష్కారం ప్రభుత్వ బాధ్యతని స్పష్టం చేశారు. గ్రామంలో ఇళ్ల స్థలాల సమస్య తన దృష్టికి వచ్చిందని, దీనిపై దృష్టి సారించి పరిష్కార చర్యలు తీసుకుంటామని తెలిపారు. అలాగే స్మశాన వాటికల అభివృద్ధిపైన ప్రత్యేక శ్రద్ధ చూపుతామని చెప్పారు. గ్రామంలో నెలకొన్న తాగునీటి సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించే దిశగా అధికారులు పనిచేయాలని ఆదేశించారు.

గత పాలకుల కాలంలో తాగునీటి పనులకు టెండర్లు దక్కించుకున్న కాంట్రాక్టర్లు, అప్పటి పాలకుల తప్పిదాల కారణంగా మధ్యలోనే పనులు వదిలేసి వెళ్లిపోయారని విమర్శించారు. అయితే కూటమి ప్రభుత్వంలో అలాంటి పరిస్థితులు ఉండవని, సమస్య ఉన్న చోటే ప్రజా ప్రతినిధులు, అధికారులు ఉంటారని భరోసా ఇచ్చారు.

ప్రజాదర్బార్‌లో ప్రజలు వ్యక్తం చేసిన సమస్యలను సంబంధిత శాఖల అధికారులు వెంటనే నమోదు చేసి, నిర్ణీత గడువులో పరిష్కారం చూపాలని ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ఆదేశించారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రజలకు పాలన మరింత దగ్గరైందని గ్రామస్తులు సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్, కూటమి నేతలు, అధికారులు, మహిళలు, స్థానిక ప్రజానీకం పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
