Bio Resource Center | సహజ వ్యవసాయానికి…

Bio Resource Center | సహజ వ్యవసాయానికి…
- బయో రిసోర్స్ సెంటర్లు కీలకం…
- జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి
Bio Resource Center | కర్నూలు బ్యూరో, ఆంధ్రప్రభ : సహజ వ్యవసాయాన్ని ప్రోత్సహించడంలో బయో రిసోర్స్ సెంటర్లు కీలక పాత్ర పోషిస్తున్నాయని జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి అన్నారు. ఇవాళ కల్లూరు మండలం తడకనపల్లె గ్రామంలో సహజ వ్యవసాయం జాతీయ మిషన్ సహకారంతో ఏర్పాటు చేసిన బయో రిసోర్స్ సెంటర్‌ను జిల్లా కలెక్టర్ పాణ్యం ఎమ్మెల్యేతో కలిసి ప్రారంభించారు.
ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ… సహజ వ్యవసాయం జాతీయ మిషన్ లక్ష్యాలకు అనుగుణంగా జిల్లాలో సహజ వ్యవసాయ విస్తరణకు అవసరమైన అన్ని చర్యలు చేపడుతున్నామని తెలిపారు. బయో రిసోర్స్ సెంటర్ల ద్వారా జీవామృతం, ఘనజీవామృతం, దశపర్ణి కషాయం వంటి సహజ ఎరువులను స్థానికంగానే తయారు చేసి రైతులకు అందించనున్నట్లు చెప్పారు. సహజ వ్యవసాయం వల్ల సాగు ఖర్చులు తగ్గడమే కాకుండా నేల ఆరోగ్యం మెరుగుపడుతుందని పేర్కొన్నారు. రైతులు రసాయన ఎరువులు, పురుగుమందులపై ఆధారపడకుండా ప్రకృతి అనుకూల విధానాలను అవలంబించి ఆరోగ్యకరమైన ఆహార ఉత్పత్తి, పర్యావరణ పరిరక్షణకు తోడ్పడాలని కలెక్టర్ సూచించారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత మాట్లాడుతూ… రాష్ట్ర ప్రభుత్వం సహజ వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తూ రైతులకు దీర్ఘకాలిక లాభాలు చేకూర్చే విధంగా పలు కార్యక్రమాలు అమలు చేస్తోందన్నారు. బయో రిసోర్స్ సెంటర్ల ద్వారా రైతులు స్వయం సమృద్ధి సాధించే దిశగా ముందడుగు వేస్తారని పేర్కొన్నారు. సహజ వ్యవసాయ పద్ధతులను అవలంబించి పర్యావరణ పరిరక్షణతో పాటు స్థిరమైన వ్యవసాయ అభివృద్ధి సాధించాలని రైతులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కర్నూలు ఆర్డీఓ సందీప్ కుమార్, కల్లూరు తహసీల్దార్ ఆంజనేయులు, తడకనపల్లె సర్పంచ్ సహేరాబి, కల్లూరు మండల సమాఖ్య అధ్యక్షురాలు ఎస్.జుబేదాబి తదితరులు పాల్గొన్నారు.

