Cell Phone | మీ ఫోన్‌ పోయిందా.. ఇలా చేయండి..

Cell Phone | మీ ఫోన్‌ పోయిందా.. ఇలా చేయండి..

  • ఇంట్లో నుంచి ఫిర్యాదు చేస్తే సరి..
  • విజయవంతంగా పనిచేస్తున్న సీఈఐఆర్‌ పోర్టల్‌..
  • సెల్ ఫోన్ దొంగలు ఇక కాచుకో..

Cell Phone | నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ : ఆధునిక జీవితంలో సెల్‌ఫోన్‌ లేకుంటే ఒక్క క్షణం గడవదు. మన జీవితాల్లో అత్యంత ముఖ్యమైన సాధనంగా ఫోన్ మారిపోయింది అన్నది నిజం. మనం ఇతరులతో మాట్లాడటానికే కాకుండా.. అందులో కాంటాక్టు నంబర్లను నిక్షిప్తం చేసుకుంటాం.. అది ఒక ఎత్తైతే.. ఇప్పుడు సెల్‌ ఫోన్‌ అనేది వ్యక్తిగత కంప్యూటర్‌లా (Computer) మారిందనటంలో ఎలాంటి సందేహం లేదు. అందులోనే మన బ్యాంకు ఖాతాలు, ఆర్థిక లావాదేవీలు, ఫొటోలు, ముఖ్యమైన పత్రాలను దాచుకుంటున్నాం. అలాంటి అత్యంత ముఖ్యమైన ఫోన్‌ పోయినా.. చోరీకి గురైనా మనకు కాలూచేయీ ఆడవు. ఫోన్‌ పోవడం వల్ల ఆర్థికంగా నష్టపోవడమే కాకుండా మన డేటా చోరీ అవుతుందని భయపడతాం. దీంతో పాటు పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసి దాని చుట్టూ తిరగాల్సి ఉంటుంది. అయినా అది దొరుకుతుందో లేదోనని ఆందోళన చెందుతాం. చివరకు విసిగివేసారి వదిలేస్తాం. కానీ ఫోన్‌ పోతే దానిని కనిపెట్టి అప్పగించేందుకు మనకో పోర్టల్‌ ఉందని మీకు తెలుసా..?

కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని టెలికమ్యూనికేషన్లశాఖ (డీవోటీ) (DOT) దీనిని రూపొందించింది. సీఈఐఆర్‌ పేరుతో రూపొందించిన ఆ పోర్టల్‌ ఇప్పటికే విజయవంతంగా పని చేస్తోంది. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో పోలీసుశాఖలతో కలిసి అనేక వేల ఫోన్లను రికవరీ చేసి బాధితులకు అందజేసింది. మన ఫోన్‌ పోతే పదే పదే పోలీస్‌ స్టేషన్ల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా ఆన్‌లైన్‌ ద్వారానే ఈ పోర్టల్‌లో ఫిర్యాదు చేయవచ్చు. అయితే.. దీనికి మనం పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లుగా రసీదు నంబరును ఎంటర్‌ చేయాల్సి ఉంటుంది. దేశంలోని కొన్ని రాష్ట్రాలు ఆన్‌లైన్‌లోనూ పోలీస్‌ స్టేషన్లలో ఫిర్యాదు చేసే అవకాశాన్ని కల్పించాయి. అలా వచ్చే రసీదు నంబరును ఎంటర్‌ చేసి సీఈఐఆర్‌ పోర్టల్‌లో ఫిర్యాదు చేయవచ్చు.

Cell Phone | సీఈఐఆర్‌ అంటే ఏంటి..?

టెలికమ్యూనికేషన్లశాఖ (డీవోటీ) అభివృద్ధి చేసిన సెంట్రల్‌ ఎక్విప్‌మెంట్‌ ఐడెంటిటీ రిజిస్టరు (సీఈఐఆర్‌) పోర్టల్‌ ఒక కేంద్రీకృత వ్యవస్థ. దాని ప్రధాన పని పోగొట్టుకున్న, చోరీ అయిన ఫోన్లను బ్లాక్‌ చేయడంతో పాటు లొకేషన్‌ను గుర్తించడం జరుగుతుంది అని నంద్యాల టెలికం అధికారి, టెలికం శాఖ నిర్వాహకుడు దేవరశెట్టి శ్రీనివాస్ లు తెలుపుతున్నారు. దేశంలోని అన్ని టెలికం కంపెనీల (Company) డేటాబేస్‌తో ఈ పోర్టల్‌ అనుసంధానమై ఉంటుందన్నారు. ఒక్కసారి మీ పోయిన ఫోన్‌ ఐఎంఈఐ నంబరును పోర్టల్‌లో ఎంటర్‌ చేయగానే దేశంలోని అన్ని నెట్‌వర్క్‌లలో ఫోన్‌ పని చేయడం ఆగిపోతోంది.

Cell Phone

Cell Phone | ఫిర్యాదు ఎలా చేయాలి..?

మీ ఫోన్‌ పోయినా, చోరీకి గురైనా.. వెంటనే టెలికం ఆపరేటర్‌కు ఫోన్‌ (Phone) చేసి సిమ్‌కార్డును బ్లాక్‌ చేయించాలి. ఇది మీ నంబరు దుర్వినియోగాన్ని అడ్డుకుంటుంది. ఆ తర్వాత పోలీసు విభాగం వెబ్‌సైట్‌లోగానీ, యాప్‌లో గానీ పోలీస్‌ స్టేషన్‌లో ‘ఇ-ఎఫ్‌ఐఆర్‌’ ఫైలు చేయాలి. ఆన్‌లైన్‌లో అవకాశం లేని వారు ఒక్కసారి స్టేషన్‌కు వెళ్లాల్సి ఉంటుందన్నారు. ఆ తర్వాత ఫిర్యాదు డిజిటల్‌ ప్రతిని భద్రపరుచుకోవాలని సూచించారు. ఎఫ్‌ఐఆర్‌ అయ్యాక ceir.sancharsaathi.gov.in పోర్టల్‌లోకి వెళ్లాలి. ‘బ్లాక్‌ స్టోలెన్‌/లాస్‌ మొబైల్‌’ ఆప్షన్‌ను ఎంచుకోవాలి. పోర్టల్‌లో మొబైల్‌ ఫోన్‌ మోడల్‌ నంబరు, ఐఎంఈఐ నంబరు, కొనుగోలు చేసిన బిల్లు ఉంటే దానిని, పోలీసు (Police) ఫిర్యాదు రసీదును అప్‌లోడ్‌ చేయాలన్నారు. ఈ వివరాలన్నీ నమోదు చేయగానే మీ ఫోన్‌ పని చేయకుండా బ్లాక్‌ అవుతుంది. వేరే సిమ్‌తో ఎవరైనా ప్రయత్నించినా పని చేయదు. అలా చేసిన వెంటనే పోలీసులకు, పోర్టల్‌కు అలర్ట్‌ వస్తుంది. దీంతో పోలీసులు ఆ ఫోన్‌ను రికవరీ చేయడానికి అవకాశం కలుగుతుంది.

Cell Phone | ప్రయోజనాలివే..

ఫోన్ పోయినట్లు ఫిర్యాదు చేయగానే ఫోన్‌ బ్లాక్‌ అయి అందులోని డేటా చోరీ కాకుండా కాపాడుతుందన్నారు. బ్యాంకుల (Bank) యాప్‌లు, వ్యక్తిగత సమాచారానికి భద్రత లభిస్తుందన్నారు. దేశంలోని అనేక రాష్ట్రాలు వేల ఫోన్లను ఈ పోర్టల్‌ సాయంతో గుర్తించి బాధితులను అందజేశాయన్నారు. పాత ఫోన్లు కొనేవారు ఈ పోర్టల్‌ ద్వారా అది చోరీ చేసిందా లేదా అనేది తెలుసుకోవచ్చుఅని తెలిపారు.

CLICK HERE TO READ రైలులో అగ్ని ప్రమాదం..

CLICK HERE TO READ MORE

Leave a Reply