Revanth Reddy | ఢిల్లీ బయల్దేరిన సీఎం రేవంత్…

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుక్రవారం సాయంత్రం ఢిల్లీ పర్యటనకు బయలుదేరారు. రేపు (శనివారం) జరగనున్న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (CWC) అత్యున్నత స్థాయి సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు.
ఢిల్లీలో కొత్తగా నిర్మించిన ఏఐసీసీ కార్యాలయం ‘ఇందిరా భవన్’ వేదికగా ఉదయం 10:30 గంటలకు కీలక భేటీ ప్రారంభం కానుంది. పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో దేశవ్యాప్త రాజకీయ పరిణామాలు, పార్టీ బలోపేతంపై చర్చించనున్నారు.
ముఖ్యంగా ఈ సమావేశంలో కేంద్ర ప్రభుత్వం మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరు మార్పు చేయడంపై కాంగ్రెస్ తన నిరసనను వ్యక్తం చేయడంతో పాటు, భవిష్యత్తు కార్యాచరణను ఖరారు చేయనుంది. రానున్న ఎన్నికల వ్యూహాలు, వివిధ రాష్ట్రాల్లో పార్టీ పరిస్థితులపై కూడా చర్చ జరగనుంది.
ఇక, రేవంత్ రెడ్డి తన ఢిల్లీ పర్యటనలో భాగంగా పార్టీ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలతో పాటు పలువురు కేంద్ర పెద్దలను కూడా కలిసే అవకాశం ఉన్నట్లు సమాచారం. తెలంగాణలో అమలవుతున్న గ్యారెంటీలు, రాష్ట్ర రాజకీయ పరిస్థితులను ఆయన అధిష్టానానికి వివరించనున్నారు.
