Bhodhan – సస్పెండ్ చేసారు సరే. మరి.. డబ్బు..?

Bhodhan – సస్పెండ్ చేసారు సరే. మరి.. డబ్బు..?

బోధన్, ఆంధ్ర ప్రభ – మెప్మా, ఐకెపి సిబ్బంది విధులలో నిర్లక్ష్యం పొదుపు సంఘాలకు ఆర్థిక భారంగా మారుతున్నాయి. మహిళా సంఘాలు పొదుపులు, రుణ చెల్లింపుల సొమ్ము సొంతానికి వాడుకుంటున్న ఆర్పీలను తొలగించి వారి స్థానంలో కొత్తవారిని నియమించి చేతులు దులుపుకోవడం మినహా దుర్వినియోగమైన సొమ్ము రాబట్టే అవకాశాలను సిబ్బంది పరిశీలించడం లేదు. దుర్వినియోగానికి పాల్పడిన వీఓఏలు, ఆర్పీలను తో పాటు ఏపిఎం, కోఆర్డినేటర్ ల పై కూడా కేసు నమోదు చేయాలని డిమాండ్లు వస్తున్నాయి. స్వయం సహాయక సంఘాల పొదుపు రుణ చెల్లింపులు పర్యవేక్షించాల్సిన మెప్మా ఐకెపి సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల పెద్ద మొత్తంలో మహిళా సంఘాలు ఆర్థికంగా నష్టపోవాల్సిన వస్తుంది. బోధన్ (Bhodan) పట్టణంలోని పాన్ గల్లీ, రాకాసి పేట్ ఆర్పీలు, మహిళల పొదుపు సొమ్మును రెండు సంవత్సరాల నుండి వాడుకుంటున్నారు.

గ్రూపు సభ్యులు బ్యాంకుకు వెళ్లి చెల్లించాల్సిన సొమ్ము ఆర్పీల చేతికి ఇవ్వడంతో వారు సొమ్ము సొంతానికి వాడుకొంటున్నారు. బోధన్ (Bhodhan) మండలంలోని కల్దుర్కి, బెల్లాల్, అమ్దాపూర్ గ్రామాలలో సుమారు కోటి రూపాయల వరకు పొదుపు సొమ్ములు, స్త్రీ నిధి సొమ్ములు దుర్వినియోగం అయ్యాయి. రెండేళ్ల తరువాత కల్దుర్కిలో దుర్వినియోగం అయిన సొమ్మును చెల్లించడంతో పొదుపు సంఘాల మహిళలు ఊపిరి పీల్చుకున్నారు. బోధన్ (Bhodhan) పట్టణంలో దుర్వినియోగం అయిన సొమ్ము ఇంకా లెక్క తేలలేదు. మహిళా సంఘాల ఆర్ధిక లావాదేవీలు పర్యవేక్షించే మెప్మా కోఆర్డినేటర్ లు, ఎపియంలు బాధ్యత రాహిత్యం ఈ దుర్వినియోగంలో కనిపిస్తుంది. రుణాల మంజూరు, చెల్లింపులు నిత్యం పర్యవేక్షించే అధికారులు పట్టీ పట్టనట్లు వ్యవహారిస్తున్నారు. దుర్వినియోగం అవుతున్న విషయం మహిళా సంఘాలు మెప్మా కో ఆర్డినేటర్ కు, ఎపియంలకు తెలిపినప్పటికి వారిని ఫిర్యాదు చేసిన గ్రూపు సభ్యులను చులకనగా చూస్తున్నారు.

రుణాల మంజూరు సమయంలో రెండు శాతం సొమ్ము మెప్మా సిబ్బందికి మహిళా సంఘాలు చెల్లించవలసి వస్తుంది. బ్యాంకుల నుంచి రుణాల సొమ్ము తీసుకునే సమయంలో ఇవ్వవలిసిన మొత్తం ఆర్పీలు వసూలు చేసి సిబ్బందికి చెల్లిస్తారు. అందువల్ల ఫిర్యాదుల పై ఎపియంలు సకాలంలో స్పందించడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు. సొమ్ము దుర్వినియోగం అయిన సందర్భాలలో సిబ్బంది పై కూడా పోలీసు కేసులు నమోదు చేస్తుంటే.. కొంత మేర అవినీతికి పాల్పడే అవకాశాలు తక్కువగా ఉంటాయని తెలుస్తుంది. మహిళలను కోటీశ్వరులు చేయాలని ప్రభుత్వాలు ప్రకటిస్తున్నా.. ముందు క్షేత్ర స్థాయిలో ప్రభుత్వ సిబ్బందిని గాడిలో పెట్టాల్సి ఉంటుంది.

Leave a Reply