kanchikacherla | సమస్యల నిలయాలు.. వసతి గృహాలు..

kanchikacherla | సమస్యల నిలయాలు.. వసతి గృహాలు..

kanchikacherla, ఆంధ్రప్రభ : పేద విద్యార్థులు ఉండే ప్రభుత్వ వసతి గృహాల్లోని విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు ప్రభుత్వం ఒక పక్క అన్ని ఏర్పాట్లు చేస్తున్నా, అధికారుల పర్యవేక్షణ కొరవడటంతో పలు వసతి గృహాల నిర్వహణ అధ్వానంగా తయారయింది. దీంతో వసతి గృహాల్లో ఉండే విద్యార్థులు పలు సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తోంది. త్రాగేందుకు విద్యార్థులకు పరిశుభ్రమైన మంచినీటి వసతులు కూడా కరువయ్యాయి. మండలంలో ఎక్కడ ఆర్ ఓ ప్లాంట్ లు లేవు. పబ్లిక్ కుళాయి నీటితోనే కాలం గడపాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. వంద మంది విద్యార్థులు ఒక్కొక్క హాస్టల్లో ఉండాల్సిన లక్ష్యం ఉండగా ఎక్కడా అత్యధికంగా 65 నుంచి 70 మంది విద్యార్థులు ఉండకపోవడం విశేషం. శీతాకాలంలో సైతం ఉదయాన్నే చన్నీటితోనే స్నానం చేయాల్సిన దుర్భర పరిస్థితులు ఉన్నాయి.

వసతి గృహాలలోని విద్యార్థులకు విద్యాపరంగా దృష్టి సారించాల్సిన అవసరాలు కనిపిస్తున్నాయి. కంచికచర్ల మండలంలో మొత్తం నాలుగు సంక్షేమ వసతి గృహాలు ఉన్నాయి. మండలంలోని పరిటాల, పెండ్యాలలో బీసీ బాలుర వసతి గృహాలు కొనసాగుతుండగా, కంచికచర్లలో సాంఘిక సంక్షేమ శాఖ బాలుర వసతి గృహం, గండేపల్లిలో ఎస్ డబ్ల్యూ బాలికల వసతి గృహాలు కొనసాగుతున్నాయి. కంచికచర్ల గండేపల్లి లలో ప్రభుత్వ భవనాలలో వసతి గృహాలు కొనసాగుతుండగా, పెండ్యాల, పరిటాల బీసీ బాలుర వసతి గృహాలు మాత్రం అద్దె భవనాలలో కొనసాగుతున్నాయి. పెండ్యాల బీసీ బాలుర వసతిగృహం ఇరుకుగా మరీ అద్వాన పరిస్థితిలో ఉంది. పర్యవేక్షణ కొరవడటంతో విద్యార్థుల హాజరు కూడా అంతత మాత్రంగానే ఉంది.

మురుగు నీరు వెళ్లేందుకు కూడా మార్గం లేదు. బాత్రూములు అపరిశుభ్ర వాతావరణంలో ఉన్నాయి. భవనం పెచ్చులు ఎప్పుడు ఊడి పడతాయో తెలియని పరిస్థితులు ఉన్నాయి. హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ అందుబాటులో ఉండటం లేదనే ఆరోపణలు వినవస్తున్నాయి. పెండ్యాల బాలుర వసతి గృహం పై అధికారులు శ్రద్ధ వహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కంచికచర్ల సాంఘిక సంక్షేమ శాఖ బాలుర వసతి గృహంలో మొత్తం 54 మంది విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం అందిస్తున్నట్లు హెచ్ డబ్ల్యు ఓ వై దాసు తెలిపారు. ఇక్కడ కూడా ఆర్ ఓ ప్లాంట్ లేకపోవడంతో పబ్లిక్ కుళాయి నీరే విద్యార్థులు త్రాగాల్సి వస్తోంది. పదో తరగతి విద్యనభ్యసించే పది మంది విద్యార్థులకు నైట్ ట్యూషన్లు ఏర్పాటు చేశారు. ప్రతినెలా విద్యార్థులకు వైద్య పరీక్షలు చేపిస్తున్నట్లు తెలిపారు. ఈ ఏడాది ఫిబ్రవరి మార్చిలో భవనానికి మరమ్మతులు చేయడంతో సౌకర్యవంతంగా ఉంది.

పరిటాల బీసీ బాయ్స్ హాస్టల్ కూడా అద్దె భవనాల్లోనే కొనసాగుతున్నది. 66 మంది విద్యార్థులకు కేవలం నాలుగు బాత్రూంలే ఉన్నాయి. ప్రస్తుతం భవన యజమాని కాళీ చేయమనడంతో ప్రత్యామ్నాయ భవనం కోసం చూస్తున్నారు. గండేపల్లి జనరల్ బాలికల వసతి గృహంలో వంద మంది విద్యార్థునుల లక్ష్యం కాగా కేవలం 44 మంది విద్యార్థునులు మాత్రమే ఉంటున్నారు. ఇటీవల హాస్టల్కు మరమ్మతులు చేశారు. తాగునీటి కోసం ఆర్వో ప్లాంటు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. నిత్యం వసతి గృహాల పై ఉన్నత అధికారుల పర్యవేక్షణ కొనసాగించి పేద విద్యార్థులకు చక్కటి విద్యా సౌకర్యాలతో పాటు, మంచి పౌష్టికాహారం అందించి, చక్కని వసతులు సమకూర్చి మంచి విద్యావంతులుగా తయారు చేస్తే వారి జీవితాల్లో వెలుగులు నిండుతాయనడంలో సందేహం లేదు.

Leave a Reply