Avatar Fire and Ash | అవతార్ 3 లో మిస్సైంది ఇదే !!

Avatar Fire and Ash | అవతార్ 3 లో మిస్సైంది ఇదే !!
ఆంధ్రప్రభ : ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన దర్శకుడు జేమ్స్ కామెరూన్ నుండి వచ్చిన సినిమా అంటే అంచనాలు ఆకాశాన్ని తాకుతాయి. ‘అవతార్’ సిరీస్‌లో మూడవ భాగమైన ‘అవతార్: ఫైర్ అండ్ యాష్’ (Avatar: Fire and Ash) విషయంలో కూడా అదే జరిగింది. అయితే, ఎంత గొప్ప దర్శకుడైనా కథ, కథనంలో పట్టు కోల్పోతే ఫలితం ఎలా ఉంటుందో ఈ సినిమా నిరూపించింది.
జేమ్స్ కామెరూన్ సృష్టించిన పండోరా ప్రపంచంలోని ‘అవతార్: ఫైర్ అండ్ యాష్’ చిత్రంతో బాక్సాఫీస్ వద్ద ఊహించని ఒడిదుడుకులను ఎదుర్కొంటోంది. సాంకేతిక హంగులు ఎన్ని ఉన్నా, అసలు కథ ఆకట్టుకోలేకపోతే అది ప్రేక్షకులకు నిరాశనే మిగిలిస్తుంది. ఇండియాలో దాదాపు రూ.450 కోట్ల బడ్జెట్ టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ సినిమా.. అసలు భారతదేశంలో అవతార్ సినీ ప్రేమికులను తప్ప సామాన్య ప్రేక్షకులను మెప్పించలేదు.
డిసెంబర్ 19న విడుదలైన ‘Avatar: ఫైర్ అండ్ యాష్’ సినిమాకు ప్రధాన బలహీనత దాని నిడివి, స్లోగా సాగే కథనం. దాదాపు మూడు గంటలకు పైగా ఉన్న ఈ చిత్రం అత్యంత నెమ్మదిగా సాగుతుంది. మొదటి పార్ట్ కొత్తదనంతో ఆకట్టుకోగా.. రెండో పార్ట్ విజువల్ గ్రాండియర్ అని మార్కులు కొట్టేసింది. అయితే ఈ మూడో పార్ట్ లో ఆరెండు మిస్ అయ్యాయనే చెప్పాలి. కథలో వేగం లేకపోవడం, అనవసరమైన సీన్లతో ‘లాగ్’ చేయడం వల్ల సామాన్య ప్రేక్షకుడు విసుగు చెందే అవకాశం ఉంది. విజువల్ ఎఫెక్ట్స్ ఎంత బాగున్నా, కథలో ఆసక్తి లేకపోతే ఆ హంగులు కేవలం స్క్రాప్‌గా మిగిలిపోతాయని ఈ సినిమా చూస్తే అర్థమవుతుంది.
MCU | మళ్ళీ షీల్డ్ పట్టనున్న కెప్టెన్ అమెరికా..
పేరుకే ‘ఫైర్ అండ్ యాష్’..
సినిమా టైటిల్‌ను ‘ఫైర్ అండ్ యాష్’ అని పెట్టారు కానీ, ఆ పేరుకు తగ్గ స్థాయి సన్నివేశాలు సినిమాలో చాలా తక్కువ. సినిమాలో యాక్షన్ లేదా ఎమోషన్ పీక్స్‌లో ఉంటుందని ఆశించిన ప్రేక్షకులకు నిరాశే ఎదురైంది. కేవలం కొత్తగా ఒక అగ్ని తెగను పరిచయం చేయడానికే ఈ పేరు పెట్టినట్టు అనిపిస్తుంది తప్ప, కథ పరంగా ఆ ఇంపాక్ట్ కనిపించదు. చాలా వరకు సన్నివేశాలు రెండో భాగమైన ‘ది వే ఆఫ్ వాటర్’ను గుర్తుకు తెస్తాయి తప్ప, కొత్తదనం ఏమీ లేదనిపిస్తుంది.

కథే ప్రాణం అని నిరూపించిన చిత్రం…
జేమ్స్ కామెరూన్ లాంటి దిగ్గజ దర్శకుడు కూడా కథనంపై దృష్టి పెట్టకపోతే ఫలితం ఇలాగే ఉంటుందని విమర్శకులు అభిప్రాయపడుతున్నారు. విజువల్స్ మాత్రమే సినిమాను కాపాడలేవని, బలమైన కథ, వేగవంతమైన కథనం ఉంటేనే ప్రేక్షకుడు కనెక్ట్ అవుతాడని ‘ఫైర్ అండ్ యాష్’ నిరూపించింది. కేవలం గ్రాఫిక్స్ కోసం చూసే వారికి ఇది నచ్చవచ్చు కానీ, మంచి సినిమా అనుభూతిని కోరుకునే వారికి మాత్రం ఇది నిరాశ కలిగించే అంశమే. కేవలం విజువల్ ఎఫెక్ట్స్ నమ్ముకుని కథను పక్కన పెట్టడంతో ప్రేక్షకులు పెదవి విరుస్తున్నారు.
భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ మూడవ భాగం, ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను మెప్పించలేకపోవడంతో ఇప్పుడు ఈ సిరీస్ భవిష్యత్తుపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఇప్పటికే ‘అవతార్ 4’ పనులు జరుగుతున్నట్లు వస్తున్న వార్తలు ఇప్పుడు సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. అసలు మూడవ భాగమే ప్రేక్షకులకు విసుగు తెప్పించిన తరుణంలో, నాలుగో భాగం వస్తే ప్రేక్షకులు దానిని ఏ మేరకు ఆదరిస్తారనే అనుమానాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి.
ఈ ప్రభావం కచ్చితంగా తదుపరి రాబోయే ‘అవతార్ 4’ మీద పడే అవకాశం ఉంది. ఒక ఫ్రాంచైజీలో ఒక సినిమా నిరాశపరిస్తే, తదుపరి చిత్రంపై బజ్ క్రియేట్ చేయడం మేకర్స్‌కు పెద్ద సవాల్‌గా మారుతుంది. కామెరూన్ లాంటి దిగ్గజం మళ్ళీ తన అద్భుతమైన కథా బలంతో తిరిగి వస్తే తప్ప, నాలుగో భాగానికి పూర్వ వైభవం రావడం కష్టమేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
